ప్రజాశక్తి-రాజంపేట అర్బన్
రాజంపేట మండలంలో రోజురోజుకూ ఆక్రమణలు హెచ్చు మీరుతున్నాయి. కొండలు, గుట్టులు, వాగులు, వంకలు అన్న తేడా లేకుండా ఖాళీగా కనిపిస్తే దురాక్రమణకు గురవుతున్నాయి. చెట్లు ఎక్కడ ఉండాలో, పుట్టలెక్కడుండాలో,వాగులు, వంకలు, కొండలు, గుట్టలు... ఎక్కడెక్కడ ఏ పరిమాణంలో ఉంటే మానవ మనుగడ సాఫీగా సాగుతుంది. సహజ సిద్ధంగా ఉన్న వాగులు, వంకలు, కొండలు, గుట్టలు, చెట్లను కొందరు అవసరాల కోసం కొల్లగొడుతున్నారు. రాజంపేట మండలంలోనే ఎంతో ప్రాశస్త్యం, చరిత్ర కలిగిన చక్రాల మడుగును సైతం కొందరు దురాశాపరుల ధన దాహానికి కనుమరుగైపోతోంది. శేషాచలం అడవుల నుంచి పుల్లంగేరు గుండా ప్రవహించే చక్రాల మడుగుకు పూర్వం నుంచి ఎంతో చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ఈ మడుగే రాజంపేట పట్టణవాసులకు తాగునీరు అందిస్తూ వచ్చేది. చక్రాలమడుగు గుండా వరద నీరు ప్రవహించి పవిత్ర పుణ్యక్షేత్రమైన హత్యరాల వద్ద గల బాహుదా నదిలో కలుస్తుంది. అలాంటి చక్రాలమడుగు ఆక్రమణదారుల కారణంగా కుచించుకుపోయింది. విశాలంగా ఉన్న మడుగు కుచించుకుపోవడంతో మడుగు గుండా చెరువులోకి నీరు ప్రవహించేందుకు వీలు లేకుండా పోయింది. చక్రాల మడుగు గుండా ప్రవహించాల్సిన నీరు దురాక్రమణల వల్ల మడుగు కుచించుకుపోయి మడుగు గుండా వెళ్లాల్సిన నీరు ప్రవాహం అదుపుతప్పి జనావాసాలలోకి ప్రవహించి వరద నీరు ముంచెత్తే అవకాశం కూడా లేకపోలేదు. జవాద్ తుఫాను సంభవించిన సమయంలో ఇదేవిధంగా చక్రాల మడుగు నుంచి వరద నీరు పట్టణంలోకి ప్రవేశించి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. యేరు సాగిన ప్రతి సారీ ఇదేవిధంగా వరద నీరు పట్టణాన్ని ముంచెత్తుతోంది. మడుగు కడప-చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, ఇక్కడ భూములకు అధిక ధరలు రావడంతో జాతీయ రహదారిలో వ్యాపారాల నిమిత్తం భవనాలు నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా మడుగును కూడా ఆక్రమించడంతో దాని వైశాల్యం తగ్గిపోతూ వస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార సముదాయాల వల్ల చక్రాల మడుగు ఆక్రమణకు గురౌతూనే ఉన్నది. జాతీయ రహదారిలోని భువనగిరి పల్లి ఆర్చికి, పెట్రోల్ బంకు సమీపంలో మడుగు వైశాల్యం తగ్గి చిన్నపాటి వంకలా దర్శనమిస్తోంది.
కలెక్టర్‌కు విన్నవించినా..
ఇటీవల కాలంలో కూడా ఓ వ్యక్తి ఊటుకూరు గ్రామపంచాయతీ డిబిఎన్ పల్లె సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని మడుగును కొంతమేర ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టాడని అక్రమ కట్టడాన్ని తొలగించి చర్యలు చేపట్టి మడుగును రక్షించాలని కోరుతూ ఇటీవల డి.బి.ఎన్ పల్లె గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన అక్రమ కట్టడాలను పరిశీలించి తొలగించాలని తహశీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
అధికారుల నిర్లక్ష్యంపై అనేక అనుమానాలు
గతంలోనేగాక ఇటీవల కాలంలోనూ చక్రాల మడుగుకు ఇరువైపులా యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా, బహిరంగంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై అధికారుల తీరుపైన తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. డిబిఎన్ పల్లెకు సమీపంలో కల్వర్టు దగ్గర చేపట్టిన భవన నిర్మాణం పై రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతారు చేయడం పట్ల రెవెన్యూ అధికారుల తీరు పట్ల ప్రజలలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆ రోజుల్లో చక్రాల మడుగు వైభవం చూసిన పెద్దలు కుచించుకుపోయిన మడుగును చూసి ఇదేనా చక్రాల మడుగు అని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు తాగు, సాగునీరు అందించిన చరిత్ర కలిగిన మడుగు నేడు వ్యర్థాలు, ముసురుతో కంపు కొడుతూ దర్శనమిస్తోంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన మడుగు ఆక్రమణకు గురైనప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అధికారుల వ్యవహార శైలి పట్ల ప్రజలు నానా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మడుగు ఆక్రమణ పై అధికారులు చొరవ తీసుకోకపోతే ఒకప్పుడు ఇక్కడ చక్రాలు మడుగు ఉండేది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని రాజంపేట వాసులు ఆవేదన చెందుతున్నారు. మడుగు దురాక్రమణకు గురి కాకుండా విస్తీర్ణం, వైశాల్యం సర్వే చేపట్టి రక్షణ గోడ నిర్మించాలని., నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల తీరుపై అనుమానాలు
ఆక్రమణలపై ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. వెంటనే స్పందించిన ఆయన అక్రమ కట్టడాన్ని పరిశీలించి తొలగించాలని రాజంపేట తహశీల్దాకు చరవాణి ద్వారా ఆదేశాలు ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. కలెక్టర్ ఆదేశాలు కూడా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే అధికారుల తీరుపైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో పెద్ద తలకాయల ప్రమేయం ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోంది.
- కత్తి రమణ (డిబిఎన్ పల్లె)
అధికారులే బాధ్యత వహించాలి
గతంలో జవాద్ తుపాను సమయంలోను, అంతకుముందు పలు దపాలు చక్రాల మడుగు నుంచి వరద పోటెత్తి మా గ్రామాన్ని ముంచింది. ప్రస్తుతం ఆక్రమణలు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పుడు వరద కారణంగా మా గ్రామంలో ఎలాంటి నష్టం వాటిల్లినా ఆక్రమణలపై మేము చేసిన ఫిర్యాదులపై స్పందించని అధికారులే నైతిక బాధ్యత వహించాలి.
-కత్తి సుబ్బయ్య (డిబిఎన్ పల్లె )
చర్యలు తీసుకుంటాం
గతంలో నిర్మించిన పాత నిర్మాణాలపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఇటీవల చేపట్టిన నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశానుసారం స్థానిక వీఆర్వో, సర్వేయర్‌చే పరిశీలించడం జరిగింది. డిబిఎన్‌పల్లెకు సమీపంలోని జాతీయ రహదారి వద్ద నిర్మించిన భవనం సుమారు అర సెంటు మేర వాగులో ఉన్నట్లు తెలిసింది. ఇరిగేషన్ అధికారులతో చర్చించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.
-సుబ్రహ్మణ్యం రెడ్డి,తహసీల్దారు, రాజంపేట










