Mar 28,2021 12:30

కాగితం పూలను దగ్గర నుంచి చాలాసార్లు చూసే ఉంటారు. భలే ఉంటాయి కదా! వీటిలో వందల వర్ణాల పూలు మనకు లభ్యమవుతున్నాయి. వాటి అందాన్ని మాటల్లో వర్ణించలేం, చూసి తీరాల్సిందే. పార్కుల్లోనూ, గ్రామాల్లోనూ, పెద్ద పెద్ద భవంతుల ముందు, డివైడర్స్‌ మధ్య కాగితం పూల మొక్కలను ఎక్కువగా పెంచుతుంటారు. వీటి గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ వారం 'విరితోట'లో విహరించాల్సిందే.
బోగన్‌విల్లియా పూల మొక్కలు అనగానే కొత్తరకం పూల మొక్కలు అనుకోకండి. అవేంటో కాదు తరచూ మనం చూసే కాగితపు పూల మొక్కలే. మనం వీటిలో కొన్ని రకాల పూల మొక్కలను మాత్రమే చూసి ఉంటాం. కానీ ఇవి వందల రకాల్లో లభ్యమవుతాయి.

బోగన్‌విల్లియాలు గులాబీల్లా ముళ్లకంప జాతి మొక్కలు. వీటికి పెద్దగా నీటి వనరు అవసరం లేదు. కంపలుగా పెరిగి రేఖలు మాదిరి పువ్వులు పూస్తాయి. మధ్యలో సన్నటి పుప్పొడి చాలా అందంగా ఉంటుంది. వర్షాకాలంలో పూల కాపు కాస్త మందంగా ఉంటుంది. వేసవి, శీతాకాలంలో చెట్టునిండా పువ్వులు పూస్తాయి. ఒక్కో మొక్క పది రూపాయల నుంచి లక్ష రూపాయల ఖరీదు వరకూ ఉంటుంది. ఇవి ఎర్రమట్టి నేలల్లో బాగా పెరుగుతాయి. ఎక్కువగా ఫెన్సింగ్‌ మొక్కలుగా వీటిని పెంచుతుంటారు. ఈ మొక్కల కొన్నిటి ఆకులు ఆకుపచ్చగాను, మరికొన్నిటి ఆకులు ఆకుపచ్చ, పసుపు చారల కలబోతతో ఉంటాయి.
 

కనుల విందు.. కాగితం పూలు..

క్రీపర్‌..
ఈ మొక్క కొమ్మలు ఎగబ్రాకి పువ్వులు విచ్చుకుంటాయి. ఈ మొక్కకు ఆకులు తక్కువగాను పువ్వులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కావాల్సిన ఆకారంలో వీటిని పెంచుకోవచ్చు. వీటిలో ఒకేరకం పువ్వులు పూచే మొక్కలు, చాలా రంగుల పువ్వులు ఒకే మొక్కకు పూచే బోగన్‌విల్లియా పూల మొక్కలున్నాయి. చైనా, థాయిలాండ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలివి. ఇవి ఖరీదైన మొక్కలు. ఆర్చీలు, ద్వారాలు, హంసలు, ఏనుగులు, సింహాలు, పూర్ణకుంభాలు ఇలా రకరకాల ఆకారాల్లో వీటిని పెంచుకోవచ్చు. ఈ పువ్వులు చెట్టునుంటేనే అందం. తలలో పెట్టుకోవడానికి, మాలలు అలంకరించడానికి పనికిరావు.
 

కనుల విందు.. కాగితం పూలు..

ప్రియాంకా..
కుండీల్లోనూ పెంచుకోగల మొక్క బోగన్‌విల్లియా ప్రియాంకా. ఈ మొక్కకు ముళ్ళు తక్కువగా, పువ్వులు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇందులో తెలుపు, ఎరుపు, పసుపు, కాషాయంలాంటి అనేక రంగుల్లో పువ్వులు పూచే పూల మొక్కలున్నాయి. ఈ పూలకు వాసన ఉండదు. వీటిని గోళాకారంగా, గ్లోబు మాదిరిగా కత్తిరించుకోవచ్చు. వీటిని టేబుల్లో బోగన్‌విల్లియా అనీ పిలుస్తుంటారు.
 

కనుల విందు.. కాగితం పూలు..

గ్రాఫ్టెడ్‌..
ఇది ఒక్కో కొమ్మ ఒక్కోరకం పువ్వులు పూస్తుంది. కొమ్మలు గ్రాఫ్టింగ్‌ కట్టడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఇవి ఖరీదైన మొక్కలు. స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌, ఇండోర్‌ స్టేడియంలు, ఫంక్షన్‌హాలుల్లోనూ అలంకరించడానికి కుండీల్లో పెంచిన గ్రాఫ్టెడ్‌ బోగన్‌విల్లియాను ఉపయోగిస్తున్నారు.
 

కనుల విందు.. కాగితం పూలు..

దేశవాళీ మల్టీ కలర్‌..
ఈ పూలమొక్కలు రంగు రంగుల పువ్వులతో పెద్ద పెద్ద ఆకారాల్లో నిండుగా గుభాళిస్తాయి. ఈ మొక్కలను నేలమీద పెంచితే పెద్దగా పెరుగుతాయి. వీటిని ఎక్కువగా ఫెన్సింగ్‌ మొక్కలుగా పెంచుతారు. ఇవి రాతినేలల్లోనూ పెరుగుతాయి.
 

కనుల విందు.. కాగితం పూలు..

షేప్డ్‌..
చిన్ని చిన్ని పువ్వులు మొక్క నిండా గుబురుగా పూసి సువాసనలు వెదజల్లు తుంటాయి. మొక్కకు ఆకులు తక్కువగా ఉంటాయి. వీటి కొమ్మలు ఎటువైపుకైనా వంచడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి గ్లోబ్‌, నెమలి, గొడుగు, అక్షరాలు, నక్షత్రాలు, విమానంవంటి కావాల్సిన ఆకారాల్లో మలచి, ఈ మొక్కలను పెంచుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబారు మిరాకిల్‌ గార్డెన్లో ఎక్కువగా అలరించేవి షేప్డ్‌ బోగన్‌విల్లియా
పూల మొక్కలే.

బోన్సాయ్‌..
ఏళ్ల తరబడి వయస్సున్న మహా వృక్షాలు చిన్ని చిన్ని రూపాల్లో మొక్కలుగా కుండీల్లో కొలువుదీరే వాటిని బోన్సారు వృక్షాలంటారు. వీటిని ఇంకా వామన వృక్షాలని, మరగుజ్జు వృక్షాలనీ పిలుస్తారు. బోగన్‌విల్లియా మొక్కల్లోనూ బోన్సారు వృక్షాలున్నాయి. కుండలు, స్థూపాలు, స్వాగతం చెప్పే మహిళలు ఆకారాల్లో ఈ బోన్సారు మొక్కలను పెంచుతుంటారు. వర్షాకాలంలో మొక్కలు గుబురుగా పెరిగి, ఆకారాలు మారిపోతుంటాయి. నెలకొకసారి వీటిని కావాల్సిన ఆకారంలో ట్రిమ్‌ చేసుకోవాలి. వీటిలో చాలా రకాలున్నాయి.
                                        * చిలుకూరి శ్రీనివాసరావు, 8985945506