Jul 05,2023 21:27

రథోత్సవంలో పాల్గొన్న భక్తులు, ప్రజలు

నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక శ్రీ సౌమ్య నాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు బుధవారం మధ్యా హ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. వేద పారాయణులు సంతోష్‌ కృష్ణ శర్మ ఆధ్వర్యంలో టిటిడి అర్చకులు సునీల్‌ కుమార్‌ శర్మ, సాయి కృష్ణ శర్మ, బాలస్వామి, రుత్వికులు శ్రీనివాస్‌, ఎంజి కృష్ణ తరుణ్‌ పార్థ సారథి, భార్గవ్‌, సీతారాం, ప్రశాంత్‌, మనోజ్‌ కుమార్‌, పవన్‌ ఆచా ర్యులు మంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ముందుకు సాగనంపారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు గోవింద నామస్మరణలతో మాడవీధులు మారు మ్రోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాజంపేట డిఎస్‌పి చైతన్య ఆధ్వర్యంలో సిఐ పుల్లయ్య, నందలూరు ఎస్‌ఐ మహ మ్మద్‌ అబ్దుల్‌ జహీర్‌ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులతో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి అశ్వ వాహనంపై మాడవీధులలో శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాధుడు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఆకేపాటి అనిల్‌ కుమార్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌ అరిగెల సౌమిత్రి, సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌ భూమన శివశంకర్‌రెడ్డి, సోమిశెట్టి ప్రభాకర్‌, పెనుబాల నాగసుబ్బయ్య, గుణ యాదవ్‌, సినీ నటుల వేణుగోపాల్‌, కాకి చంద్ర అరిగే నాని, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం : బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఇఒ నటేషన్‌ తెలిపారు.రథోత్సవంలో పాల్గొన్న భక్తులు, ప్రజలు