ఆ కన్నులు
మాటలాడుతాయి..
ఆ రెండు కన్నులు ఏకమై
మౌనంగా ఎన్నెన్నో గంపలకొద్దీ
ముచ్చట్లను మోసుకు తిరుగుతాయి ..
పలకలేని చోట
పదునైన ఆలోచన చోట
రెప్పలను ఆడిస్తూ
ఎన్నో ఖాళీలను పూరిస్తాయి.
వాడిపోయిన పువ్వులను,
రాలిపోయిన రెమ్మలను చూసి
ఎక్కడో సగం తెగిపడ్డ ఆకాశాన్ని
గుండెలకద్దుకొని తనలో దాచుకున్న
నదిపాటను పాడుతాయి..
ఆ కన్నులకు కనబడకుండా
కాలం చేసిన ప్రతీ కుట్రలకు
ప్రతిఘటిస్తూ ఒక్కోసారి ఎర్రబడతాయి..
అనంత సైన్యాన్ని వెంటేసుకొని
ఒక్క సైగతో యుద్ధం చేస్తాయి..
ఆపుతాయి కూడా ...
ఆ కన్నులకు
మరో కన్నులు జత కలిస్తే
లోకమంతా పచ్చగా పరిమళిస్తుంది
ఎన్నో హావభావాలతో
స్నేహం చిగురిస్తుంది..
ఆకాశానికి కట్టిన ఊయలలు ఊగుతూ
సరికొత్త పాటలతో పక్షులై విహరిస్తాయి..
ఎవరైనా కన్నులబాష
వింటే బాగుండు..
కన్నీటివ్యధలు మాత్రమే కాదు
చరిత్రలో దాయబడ్డ కథలు తెలుసుకుంటే బాగుండు ..
అక్కడొక రెండు కన్నులు
మాట్లాడుతున్నాయి..
- రామ్ పెరుమాండ్ల
95422 65831