
మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు గంటలు గంటలు ఏకాంతంగా ఉండగలమేమోగానీ మనకు నచ్చని చోట నచ్చని మనుషుల మధ్య అస్సలు అరగంట కూడా ఇమడలేము. సమీరా పరిస్థితి అదే. ఆమెకిపుడు మహా చెడ్డ చిరాకుగా ఉన్నది. 'నేను రానత్తా.. నాకు ఇలాంటి పార్టీలూ, ఫంక్షన్లూ అంటే మహా చిరాకు!' అన్నా వినకుండా ఊరి నుండి వచ్చిన సమీరను ఆమె మేనత్త భారతి ఒక ప్రముఖ రాజకీయ నాయకుని ఇంటికి కిట్టీ పార్టీకి తీసుకొచ్చింది. ఒకరినొకరు షేక్‌హాండ్‌లూ, హగ్‌లతో పలకరించుకుంటున్నారు. అది చాలా చిన్నపార్టీనే కానీ వచ్చిన వాళ్ళ ఖరీదైన వస్త్రధారణ, శ్రద్ధతో కూడిన అలంకరణ, పట్టిపట్టి మాట్లాడుతున్న స్టైలిష్ మాటలూ.. ఆంగ్ల పదాలూ కలగలిపిన సంభాషణల పరంపరలూ కొనసాగుతున్నాయి. ఒకరి గురించి ఒకరు మరీ మరీ ఆరాలు తీసుకుంటూ.. ఒకరిని మించి ఒకరు పోటీపడి గొప్పలు చెప్పుకుంటున్నారు.
వచ్చిన వారందరూ సమీర ఎవరని భారతిని అడుగుతున్నారు. 'సమీర మా మేనకోడలండీ బెంగళూరులో బీటెక్ చదువుతున్నది!' అంటూ మేనకోడలిని గొప్పగా పరిచయం చేస్తున్నది. 'ఓహో మేనకోడలేనా కాబోయే కోడలు కూడానా?' అని వారు సమీరా ముఖం మీదే జోక్స్ వేస్తున్నారు. అది సమీరకు చాలా ఇబ్బందిగా, భారతికి మహా సంబరంగా ఉన్నది.
స్టాటర్ అంటూ ఏదో డ్రింక్ ఇచ్చారు. దాన్ని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ వచ్చిన వారినల్లా గమనిస్తూ చాలాసేపు గడిపింది. 'వీళ్ళందరూ పెద్ద రాజకీయవేత్తల భార్యలూ, బిజినెస్ మెన్స్ భార్యలూ, లాండ్‌లార్డ్స్ భార్యలూనూ. అందరూ పెద్ద పెద్ద సంస్థల్లో, క్లబ్బుల్లో సభ్యత్వాలు వున్నవారూ, ప్రెసిడెంట్స్‌గా, చైర్‌పర్సన్స్‌గా హోదాలు ఉన్నవారూనూ..' అంటూ ఒక్కొక్కరి హోదా వివరిస్తూ పరిచయం చేస్తూ.. రేపొద్దున్న నీవు వీరందరితో ఎలా ప్రవర్తించవలసి వుంటుందో తెలుసా?' అన్నట్టు చూస్తున్నది భారతి.
ఇంతలో ఒకామె వచ్చింది. తానో మహారాణిని అన్నట్టు, రాకూడని ప్రదేశానికి వచ్చినట్టు ఇబ్బందిగా కూర్చుంది. చాలా ఖరీదైన పట్టుచీర, రవ్వల నగలతో మెరిసిపోతున్నది. చాలా అందంగా ఉన్నది. కానీ నవ్వీ నవ్వని నవ్వులతో, అతికీ అతకని మాటలతో ఎటో చూస్తూ గడుపుతున్నది. అబ్బో.. 'ఒక్కొక్కళ్ళకి ఎంత గర్వమో' మరోసారి అనుకున్నది. ఆమె పేరు అశ్విని అని, ఒక యువ ఎమ్మెల్యే భార్య అని పరిచయం చేసింది భారతి. కానీ అశ్విని చూపులు ఎటో ఉన్నాయి. చాలా అనాసక్తంగా కూర్చుని ఉన్నది.
సమీర శ్రీరామ్‌కి ఫోన్ చేసి 'బావా.. నువ్వు కాస్త డేర్ చేసి, అత్తయ్యకు మనం పెళ్ళి చేసుకోలేమని.. చేసుకోబోమని చెప్పేస్తే నాకీ తిప్పలు ఉండేవి కావు కదా! అత్తయ్య అందరికీ నన్ను పరిచయం చేయడం వాళ్ళేమో మేనకోడలా? కాబోయే కోడలా? అని జోకడం చాలా ఇబ్బందిగా ఉంది. నేనేమో నానమ్మను చూసి చాలా కాలమైందని నాన్నతో పాటు ఇక్కడకు వచ్చి, ఇలా ఇరుక్కుపోయాను.'
'సమీ..! నిన్నూ నన్నూ కలపి బంధుత్వాలను కలుపుకోవడం కంటే.. మీ ఆస్తి, మా ఆస్తులను కలపడమే ఆ పెద్దోళ్లకు కావలసింది. కొద్దిగా టైమ్ ఇవ్వు. నేను అన్నీ సెట్ చేసేస్తాను'.
'సరే బావా! ఇక్కడో ఆంటీ ఉన్నారు. అందరిలోకి నాకు ఆమె బాగా నచ్చారు. చాలా చిన్న ఆంటీ. భలే క్యూట్‌గా ఉన్నారు. కానీ ఎవరితోనూ మాట్లాడడం లేదు.'
'సరేలే సమీ.. మనం తరువాత మాట్లాడుకుందాము. నాకు వేరే పని ఉన్నది బై.'
'ఒకే బావా' ఫోన్ ఆఫ్ చేసి చుట్టూ చూసింది.
'శారద గారూ.. ఏంటీ చాలా చిక్కిపోయారు? ఏమి చేస్తున్నారో మాకూ చెప్పరూ?'
'ఓ చిక్కానంటారా..? అలాంటి మాట కోసమే చూస్తున్నా. నిజంగా చిక్కానా..?' ఆమె వచ్చిన ప్రతివారినీ అదే ప్రశ్న అడగసాగింది.
'ఈ మధ్య ఏమి ప్రొడక్ట్స్ కొన్నారు..?' ఒకామెకు అలంకరణ సామగ్రి పట్ల అత్యంత శ్రద్ధ.
''ఆ చీరల నాగభూషణం వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తే ఎత్తలేదేం?'' మరొక గుంపు చీరల్లో ముచ్చటల్లో మునిగింది. ''నగల రాధేశ్యామ్ ఎల్లుండి కొత్త డిజైన్ల కాట్‌లాగ్ తెస్తున్నాడు. ఇష్టమున్నవారు నాకు కాల్ చెయ్యండి..' మరో చిన్నగుంపు. ఇలాంటి మాటలే.. ''మీ మామగారు ఇంకా అలాగే గట్టిగా ఉన్నారా? మీ అత్తగారు ఏమన్నా మారారా?' కొన్ని గుసగుసలు.. విదేశాల్లో ఉన్న పిల్లల కబుర్లు. అవన్నీ చాలా సహజమైనవే కావొచ్చు.. కానీ సమీరకే అదోలా ఉన్నది.
'మీ వయసువారు ఇక్కడ ఎవరూ లేరనా అదోలా ఉన్నారు..' అశ్విని మాట కలిపింది. హమ్మయ్య ఈమెకు మాటలు వచ్చు అనుకుని 'మీరు మాత్రం ఏమంత పెద్ద వయసువారని..' సమీర మనస్పూర్తిగానే అన్నది కానీ.. అశ్విని ఖరీదయినా చీరని, వంటెడు నగలు చూస్తుంటేనే మాత్రం కాస్త చిరాకుగా ఉన్నది. ఆమె అడిగిన వాటికి ముక్తసరి జవాబులను ఇచ్చింది. కాసేపయ్యాక వాళ్ళంతా హౌసింగ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. సమీర, అశ్విని అందులో పాల్గొనలేదు. సమీర ఫోన్ చూస్తూ కూర్చుంటే.. అశ్వని ఆ పక్కనే ఉన్న అరలో నుండి ఇంగ్లీషు నావెల్ ఏదో తీసి చదవసాగింది. 'ఈ గొప్పోళ్ళూ అరల్లో గాజుపాత్రలు ఎలా పెట్టుకుంటారో పుస్తకాలు కూడా అట్లానే అలకరించుకుంటారు. ఈమె చదవడం కూడా అలాగే అలంకార ప్రాయమే.. ఎంత ఫోజో.. ఎంత స్టయిల్‌గా పట్టుకుందో బుక్‌ని..' అనుకుని నవ్వుకుంటూ ఫోన్‌లో మళ్ళీ మునిగిపోయింది సమీర.
కాసేపటికి భోజనాల దగ్గరికి పిలిచారు. రకరకాల పదార్థాలు ఎదురుగా ఉన్నాయి. ఎందుకో ఏదీ రుచిగా అనిపించలేదు. చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారో అర్థంకాని సవ్వడులు. వయసు తెలియకుండా చేసుకున్న అలంకరణ.. తమకు నప్పని రంగుల వస్త్రధారణ.. హుషారుగా ఉండడానికి అరిచే అరుపులూ.. ఏదో కోలాహలం. నవ్వుల్లో, ఆ జోష్‌లో అడుగడుగునా ఏదో కృత్రిమత్వం కనపడుతున్నది. బిగుసుకుపోయి కూర్చుని .. మధ్య మధ్య నవ్వులు ఒక మాట కలుపుతున్న అశ్వినిని చూస్తుంటే ఇంకొంచెం మండుతున్నది.
భోజనాలయ్యాక ఎవరో చిట్టీ తీశారు. ఎవరికో అయిదు లక్షల రూపాయలు వచ్చాయని గోలగోలగా అరుచుకున్నారు. నవ్వుకున్నారు. కేరింతలు కొట్టారు. ఆ చిట్టీ వచ్చినవాళ్ళు.. వచ్చేనెల రెండో ఆదివారం పార్టీ ఇవ్వాలని నిర్ణయించారు. మళ్ళీ ఈసారి అంత్యాక్షరి మొదలుపెట్టారు. సమీర బయటకు వచ్చి పోర్టుకోలో వచ్చి నిలుచున్నది. అడుగడుగునా తన హోదా, తన సర్కిల్ తన గొప్ప చూపించి తాను శ్రీరామ్‌ని పెళ్ళి చేసుకోవాలని మేనత్త భారతి ప్రయత్నాలు అర్థమవుతున్న కొద్దీ ఆమెకు చిరాకు పెరుగుతున్నది. ఉన్నపళంగా తిరిగి ఊరికి వెళ్ళిపోవాలని అనిపిస్తున్నది.
'నాకు కాస్త పని వున్నది. నేను వెళ్తాను. మా డ్రైవర్ వస్తాడు. బయట వెయిట్ చేస్తాను' అశ్విని లేచి నిలబడి అనగానే 'అదేమిటి అప్పుడే వెళ్ళడం అని ఒకరు..', 'ఆమె ఎప్పుడూ ఇంతేగా..?' అని కొందరూ పెదవి విరిచారు. సమీర రకరకాల పూల మొక్కలు చూస్తూ అటూ ఇటూ తిరగసాగింది. ఇంతలో అశ్విని బయటకు వచ్చింది. వాచ్ వంకా, గేట్ వంకా అసహనంగా చూడసాగింది.
'ఈయనను డ్రైవర్‌ని పంపమని చెప్పాను. ఇంతవరకూ కారు రాలేదు. నేను త్వరగా వెళ్ళాలి..' కంగారుగా అన్నది. అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్య భర్తకు కాల్ చేస్తూ అసహనంగా వున్న అశ్వినీని.. 'ఎక్కడిదాకా వెళ్ళాలి మామ్..?' అడిగింది సమీర. 'శ్రీనగర్ కాలనీకి.. ' అని చెప్పిందామె.. 'ఒకే.. వీళ్ళు ఇప్పుడప్పుడే కదిలేట్టు లేరు. పోనీ నేను డ్రాప్ చెయ్యనా..?'
'వావ్! మీకు కారు డ్రైవింగ్ వచ్చా..?'
'హా.. వచ్చు..!'
'అవును. ఇవ్వాళా రేపు డ్రైవింగ్ రావడం పెద్ద విశేషం కాదు. కానీ ఈ మూమెంట్‌లో మీకు డ్రైవింగ్ వచ్చి ఉండడం మీరు నాకు లిఫ్ట్ ఇస్తాను అనడం నాకు చాలా రిలీఫ్‌గా ఉన్నది. పదండి.' ఆమె ఎందుకంత ఎక్సైట్ అవుతుందో అర్థంకాక కారు దగ్గరకు దారి తీసింది సమీర.
'మీ అత్తయ్యకు చెప్పరా..?' అశ్విని అనుమానంగా అడిగింది.
'చెప్పను. ఇప్పుడు చెప్తే వెళ్లొద్దంటారు. మీ ఇంటికి చేరాక చెప్తే ఏమీ అనలేరు కదా..!' ఇద్దరూ నవ్వుకున్నారు. దార్లో ఆమె చిరునవ్వుతో చక్కగా మాట్లాడింది. మెడలోని నగలన్నీ ఒక్కొక్కటీ తీసి హ్యాండ్‌బాగ్‌లో వేయసాగింది.
'ఇవన్నీ మా అత్తగారి సెలక్షన్. మీకు తెలిసే ఉంటుంది. మా మామగారు పెద్ద లీడర్. రెండేళ్ల క్రితం హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆయన స్థానంలో ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. నిజానికి ఇద్దరం ఇష్టపడి, పెద్దలను ఒప్పించి పెళ్ళిచేసుకున్నాం. ఇంకో నాలుగు నెలల్లో విదేశాల్లో స్థిరపడతాము అనగా మా జీవితం మొత్తం మారిపోయింది. అత్తయ్యను బాధపడకుండా చూసుకోవడమే ఇప్పుడు మా డ్యూటీ. ఆమె రాత్రే మా ఆడపడుచు దగ్గరకు పూణేకు వెళ్లారు..' అశ్విని చెప్పింది. అత్త కొడుకుతో పెళ్ళి ఇష్టంలేదని, కలసి పెరిగామని, మెల్లగా ఇద్దరం కలసి పెద్దవాళ్ళకు నచ్చజెపుతామనీ నానమ్మను చూసి వెళ్తానికి హైదరాబాద్‌కి వచ్చాననీ.. సమీర చెప్పుకున్నది.
కారు అశ్విని వాళ్ళింటికి చేరగానే వాచ్‌మెన్ గేట్ తీశాడు. 'నేను ఇక వెళ్తాను!' అన్నది సమీర.
'లేదు.. నాకు ఆ పార్టీల సంగతి తెలుసు కదా! ఇప్పుడప్పుడే ముగియవు. రండి. కాస్త రిలాక్స్ అవుదురు గానీ.' అని లోనికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది.
ఇల్లు చాలా బాగుంది. ఫ్రిజ్ తెరిచి గాజు పాత్రలో ఉన్న పండ్లముక్కలు సర్వింగ్‌బౌల్‌లో సర్ది ట్రేలో పెట్టి, మంచినీళ్ళ గ్లాస్‌తో సహా తెచ్చి టీపారు మీద పెట్టింది. 'మీరు అక్కడేమీ తినలేదు. నేను చూశాను. ఇవి తింటూ వుండండి. అయిదు నిముషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను' అన్నది. ఆ చల్లని పండ్ల ముక్కలు చూడగానే ఆకలి గుర్తుకొచ్చింది. మెల్లగా అవి తింటూ చుట్టూ చూసింది. అందమైన అలంకరణతో పాటు ఇంటినిండా బోలెడన్ని పుస్తకాలు కనిపించాయి.
ఓ పదినిముషాల్లో వచ్చిన అశ్వినిని చూసి అక్కడ తాను పార్టీలో చూసిన అశ్విని ఈమేనా అని ఆశ్చర్య పోయింది. వదులుగా వున్న కాటన్ నైట్‌ఫాంట్, షర్టూ వేసుకుని, జుట్టు వదులుగా వదిలేసుకుని ప్రశాంతంగా కనిపించింది.
'వావ్ మీరేనా..?' అంటూ నవ్వింది.
'హాయిగా ఉందిప్పుడు సమీరా!' అశ్విని కూడా నవ్వుతూ కూర్చుని కొద్దిగా జ్యూస్ తాగింది.
'రండి పైకి వెళ్దాం.. ఇప్పటికే లేట్ అయ్యింది' అని పైకి దారి తీసిందామె. దేనికి లేట్ అయ్యిందో అర్థంకాక మౌనంగా అనుసరించింది సమీర.
ఇద్దరూ కలిసి పైకి వెళ్ళారు. ఆమె ఆకాశం వంక అన్నిదిక్కులా అలా ఒకసారి చూసింది. పైకి చూస్తూ.. 'వచ్చేస్తున్నా..' అని చెప్పింది.. అశ్వినిని పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది సమీర. అశ్విని ఆజ్ఞ మేరకు కింద నుండీ ఒకతను వచ్చాడు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి, చిన్న క్యాను నిండా నీళ్ళు తీసుకువచ్చాడు. అక్కడొక్కటీ, అక్కడొక్కటీ పెట్టి వున్న బౌల్స్‌లో నీళ్ళు పోశాడు. మళ్ళీ గదిలోకి వెళ్ళి చిన్నచిన్న డబ్బాలు నాలుగైదు మోసుకొచ్చి అక్కడ పెట్టాడు. అశ్వినీ డబ్బాల మూతలు తీసి, దోసిళ్ళతో ధాన్యపు గింజలు ఆ ప్రదేశమంతా విరజిమ్మింది. ఆకాశంలోకి అలా మరోసారి చూసింది.
సమీర అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ముందు ఓ పది పదిహేను రామచిలుకలు వచ్చాయి. 'హాయి రామ చిలుకలూ..!' సంబరంగా అన్నది సమీర.
చిత్రంగా పది నిముషాల్లో ఆకాశంలో వలయాలు వలయాలుగా తిరుగుతూ కిచకిచలాడుతూ వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి. అన్ని రామచిలుకలను ఒక్కచోట చూడడం ఇదే ప్రథమం. దాంతో సమీర చిన్న పిల్లలా కేరింతలు పెట్టింది. 'అత్తా! నేను అశ్విని గారింట్లో ఉన్నాను. కాస్సేపాగి వస్తాను!' అని మెల్లగా ఫోన్ చేసి చెప్పింది.
'ఒకరోజు ఇద్దరం కారులో వస్తుంటే ఛార్మినార్ దగ్గర పంజరాల్లో పెట్టి రామచిలుకలను అమ్ముతున్నారు. నేను ఈయనను వాటిని ఏమి చేస్తారని అడిగాను. ''ఇలాగే కొనుక్కుని పంజరాల్లో పెట్టి, పెంచుకుంటారు. కొందరు చిలుక జోస్యం కోసం కొనుక్కుంటారు..'' అని చెప్పారు ''నేనూ కొననా?'' అని అడిగాను. ''మనం ఛార్మినార్ సెంటర్‌కి వచ్చాము. ఎవరైనా ముత్యాలనగలో, గాజులో అడుగుతారు..'' అని నవ్వారు. కానీ నాకు ఆ చిలుకలే కావాలని పట్టుబట్టాను కొనేశారు. రెండురోజుల్లో ఆయన పెద్ద పెద్ద పంజరాలు చేయిస్తాను అన్నారు. కానీ ఉదయం వాటికి మంచినీరు, ధాన్యం పెట్టి ఆయన అటు వెళ్ళగానే వాటిని స్వేచ్ఛగా వదిలేశాను. సాయంత్రం డ్రైవర్‌ని తీసుకుని వెళ్ళి.. మళ్ళీ కొన్ని కొనుక్కొచ్చుకున్నాను. వాటికీ నీరు, ఆహారం పెట్టి వదిలేశాను. ఒక నాలుగైదు రోజులు అదేపని చేశాను. అంతే ఆ రోజు నుంచి ఇలా ఈ సమయానికి అవి వచ్చి, నన్ను పలకరించి వెళ్తాయి. ఇవి నాకు మంచి మిత్రులైపోయాయి. ఆ రోజు నుంచీ ఎక్కడికి వెళ్ళినా ఈ సమయానికి ఇంటికి చేరిపోతుంటాను. రోజూ నేనే స్వయంగా వాటికి ఆహారం వేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. తప్పనిసరిగా ఊరు వెళ్ళవలసి వచ్చినరోజు మాత్రమే పనివాళ్ళకు అప్పజెపుతాను..' వాటి మధ్య తిరుగుతున్న అశ్విని భుజంపై ఒకటి, చేతి మీద ఒకటి వాలుతున్నాయి. బహుశా తమ భాషలో ధన్యవాదాలు చెబుతున్నాయేమో!
పొద్దున్న రవ్వల నగల్లో కనపడ్డ అశ్వినికి.. రామచిలుకల మధ్య హాయిగా నవ్వుతూ కనపడ్డ అశ్వినికీ ఎంత తేడా! కేవలం తన కాలక్షేపం కోసం ఆమెకు లిఫ్ట్ ఇచ్చింది. కానీ అందమైన చెట్ల మధ్య ఆమె ఇల్లూ, ఆమె అతిథ్యం, ఆమె పుస్తక ప్రపంచం.. ఈ పక్షులు.. ఓV్‌ా.. మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో! ఎలా గమ్మత్తుగా వచ్చి కిచకిచలాడుతూ ధాన్యం తిన్నాయో! నీళ్ళు తాగి అలానే మెల్ల మెల్లగా, గుంపులు గుంపులుగా వలయాలు వలయాలుగా వెళ్ళిపోతుంటే.. కాసేపటికి వచ్చి ఆమెను అల్లుకుపోయిన పిల్లలకు కబుర్లు చెబుతూ.. వారి కబుర్లు వింటూ దగ్గరుండి ఆమె ఫలహారం తినిపిస్తుంటే..
కనులకు కనపడ్డదే సత్యం కాకపోవచ్చు.. తరుచూ మనుషులు కలుస్తూ ఉంటేనే మనసులు తెలుస్తాయేమో అనుకున్నది సమీర.
- సమ్మెట ఉమాదేవి
9849406722