Mar 10,2023 22:54

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు : స్ధానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళు ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శుక్రవారం రాత్రి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దివ్య ప్రభోభోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా ఆలయంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తులను బయటకు తీసుకు వచ్చి వివిధ రకాల గజ పూలమాలలుతో, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రభ పైకి అమ్మవారిని, స్వామి వారిని వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలివాహనులు, రజకులు వివిధ రకాల క్రతువులు, కుంభం నిర్వహించి తదుపరి ఆలయ చైర్మన్‌ చెన్న కేశవ రావు, కార్యనిర్వహణాధికారి లీలా కుమార్‌లు కొబ్బరి కాయలు కొట్టి దివ్య ప్రభోభోత్సవంను ప్రారంభించారు. గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల జత ను ప్రభకు కట్టి ఆలయ చుట్టూ ప్రభోభోత్సవం కొనసాగింది. ఈసందర్భంగా మేళా తాళాలతో సన్నాయి డబ్బుకులు తీన్‌మార్‌ కోలాటం నత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డీసీపీ మేరీ ప్రశాంతి, ఎసిపి నాగేశ్వర్‌ రెడ్డి పర్యవేక్షణలో సీఐ నాగ మురళి ఎస్‌ఐ హరి పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కు బడులు తీర్చుకున్నారు.