Dec 11,2022 00:03

గిరిజన సంప్రదాయ కొమ్ముడోలు నృత్యాలతో సందడిగా మారిన చింతూరు

ప్రజాశక్తి-చింతూరు
స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరం శనివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ పాఠశాలలో 1974 నుండి 2022 వరకు పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు కలయిక విజయవంతమైంది. తమ బ్యాచ్‌కు చెందిన వారిని ఒకరినొకరు పలకరించుకొని తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సన్మానించారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కళకళ లాడింది. తొలుత శబరి నది రోడ్డు నుండి గురువులను విద్యార్థులు గిరిజన సంప్రదాయ కొమ్ము డోలు నృత్యాలతో ఘనంగా స్వాగతించారు. దారి పొడవున వందలాది మంది విద్యార్థులు పూలవర్షం కురిపించారు. మార్గం మధ్యలోని కూడలి వద్ద ఉన్న మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, గాం ఘంటం దొర, మల్లుదొర, కొమరం భీమ్‌ విగ్రహాలకు, అంబేద్కర్‌. మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కీర్తి శేషులు కామ్రేడ్‌ బత్తుల భీష్మరావు స్మారక కళామందిరంలో గౌరవ సన్మాన సభ ఏర్పాటు చేశారు. స్వాగత ఉపన్యాసం ఎసిపి పరకాల పూర్వ విద్యార్థి జూపల్లి శివరామయ్య చేశారు. సభాధ్యక్షులుగా ఆలపాటి అంకు ప్రసాద్‌ మాస్టారు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా చింతూరు ఎఎస్‌పి కెవి.మహేశ్వరరెడ్డి, సిఐ అప్పలనాయుడు, జూపల్లి వెంకటరత్నం, ఎంవిఐ శ్వేత సాయి, విశ్రాంత హెచ్‌ఎం కె.రాంబాబు, కమలాదేవి, పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.లక్ష్మణ్‌, చైర్మన్‌ ఎండి జిక్రియ, పాల్గొన్నారు. అనంతరం స్వర్ణోత్సవ పైలాన్‌ను విశ్రాంత ఉపాధ్యాయులు ఆవిష్కరణ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌, సావిత్రిబాయి పూలే, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విగ్రహాలను కమలాదేవి, వరలక్ష్మి, హిందీ మాస్టారు శర్మ ఆవిష్కరించారు.