Apr 24,2022 10:27

దుఃఖపు మేఘాలన్నీ గుండెలో గూడుకట్టుకొని
బరువెక్కిన బతుకును కన్నీటివానై తడిపేస్తున్నాయి
జోరువాన హోరులో కొట్టుకుపోతూ
కన్నీరంత ప్రవాహమై పారుతుంది
తెప్పలా పరుచుకున్న వానమబ్బులు కావవి
మోసపు దునియాలో కష్టాన్ని దోచుకొని
దొరల్లా రాజ్యమేలుతున్న మనిషి ఏర్పరచిన..
దుఃఖపు కన్నీటి వానది
ముసురుపట్టి కురుస్తున్న తుపాను వర్షమది
అడ్డుకట్ట వేసే ప్రయత్నపు తాలూకు ఆనవాళ్లు ఎక్కడని వెతకాలి
తనువులో అణువణువూ
దాగివున్న ధైర్యమంతా..
ఎందుకో బిక్కచచ్చిపోయి
ఏమూలనో దాగివుంది
చిరునవ్వుల కాలం కనుమరుగైపోయింది
తిమిరం నిండిన మదిలో వెన్నెల వెలుగులు
ఎక్కడున్నాయోనని..
ఊపిరినంతా వలవేసి వెతుకుతున్నాను
కలలన్నీ అశ్రువులో చిక్కుకొని
వరదలై పొర్లుతున్నాయి
ఆశయాలన్నీ...
చెదలుపట్టిన పురుగు
తొలచినట్లు రాలిపోతున్నాయి
ఆరబోసుకున్న కోరికల తాలూకు చిరునామా
ఇపుడు కన్నీటి వానలో కొట్టుకుపోయి
లోతుతెలియని సాగరంలో కలిసి..
ఊరిస్తూ అలలై ఎగసిపడుతున్నాయి.
రెండు కాళ్ళ బతుకుబండిని లాగాలంటే..
బాధలన్నీ కన్నీటివానై ఇంతలా
కురుస్తాయని తెలియదు.!
పరుగెడుతున్న ప్రపంచంలో మాయమవుతున్న
వ్యక్తిత్వపు విలువల్ని బతికిస్తూ..
ఒక మంచి మనిషిలా జీవిస్తున్నందుకు...
చెమటచుక్కలు ధారపోసి.. రక్తాన్నంతా
త్యాగపు ఎర్రజెండా గుర్తుగాచేసి..
అవనిపై రెపరెపలాడించిన
కార్మిక కర్షకలోకానికి..
ఈ మాత్రం కన్నీటిదారలు తప్పవేమో మరి.!

అశోక్‌ గోనె
94413 17361