Jul 31,2022 00:16

హెలికాప్టర్‌ సాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తెస్తున్న నేవీ సిబ్బంది

ప్రజాశక్తి - అచ్యుతాపురం
సముద్రతీరంలో సరదాగా గడుపుదామని వచ్చిన విద్యార్థులు కెరటాలకు బలవడంతో అనకాపల్లి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూడిమడక తీరంలో శనివారం ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. ఓ వైపు గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లు, పడవలతో అధికార యంత్రాంగం, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టడం, తమ వారు బతక్కపోతారా.. అని ఆశతో విద్యార్థుల తల్లిదండ్రుల ఎదురు చూపులు, తమ మిత్రులు తిరిగొస్తారని భావించి అక్కడే ఉన్న విద్యార్థులు.. ఇలా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కానవచ్చాయి. చివరకు శుక్రవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థులూ శనివారానికి విగత జీవులుగా మారడంతో పూడిమడక తీరం, విద్యార్థుల స్వస్థలాలు కన్నీటి సంద్రంగా మారాయి.
అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో స్నానానికి దిగి గల్లంతయిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు శనివారానికి తీరానికి చేరుకున్నాయి. అనకాపల్లిలోని డైట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు పూడిమడక సముద్రతీరంలో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లికి చెందిన గుడివాడ సూర్య పవన్‌ కుమార్‌ (18) శుక్రవారమే మృతిచెందాడు. సూరి శెట్టి తేజ అతికష్టం మీద ఒడ్డుకు చేరుకుని కొన ఊపిరితో విశాఖలోని కిమ్స్‌ ఐకాన్‌ హాస్పి టల్‌లో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఐదుగురు విద్యార్థుల కోసం శనివారం ఉదయం నేవల్‌ హెలికాప్టర్‌, హెలికాప్టర్‌, షిప్‌, పూడిమడకకు చెందిన ఆరు పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో తేలియాడుతున్న నాలుగు మృతదేహాలను హెలికాప్టర్‌ సాయంతోనూ, ఒకరి మృతదేహాన్ని పడవపైనా తీరానికి చేర్చారు. మృతిచెందిన వారిలో కంపర జగదీష్‌, సుర్ల జస్వంత్‌ కుమార్‌, బయ్యపునేని సతీష్‌ కుమార్‌, పెంటకోట గణేష్‌, జి.చందు ఉన్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్‌టిఆర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతుల కుటుంబాలను ఎంపీ బివి.సత్యవతి పరామర్శించారు.
తీరానికి తరలివచ్చిన జిల్లా యంత్రాంగం
ప్రమాద సంఘటన తెలిసిన దగ్గర నుంచీ జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగమైంది. జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌, ఎస్‌పి గౌతమి శాలిని, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డిఎస్‌పి శ్రీనివాసరావు మెరైన్‌ ఎస్‌పి లక్ష్మీనారాయణ, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. టిడిపి యలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు అధికారులతో మాట్లాడారు. సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌.రాము సముద్ర తీరాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఎం
అనకాపల్లి : మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం ఒక ప్రకటనలో కోరారు. ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు సముద్ర తీరంలో ప్రమాదవశాత్తు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. నిత్యం పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో తీరంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గస్తీ కోసం సిబ్బందిని ఏర్పాటు చేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
విద్యార్థుల మృతి బాధాకరం
తమ కళాశాల విద్యార్థులు పూడిమడక వద్ద సముద్రంలో మృత్యువాడ పడటం ఎంతో కలచివేసిందని డైట్‌ కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సముద్ర ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.
శోక సంద్రంలో గణేష్‌ కుటుంబీకులు
మునగపాక రూరల్‌ : సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయిన డైట్‌ కాలేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థులలో మండలానికి చెందిన చూచుకొండ గ్రామ విద్యార్థి పెంటకోట గణేష్‌ (22) ఉన్నారు. అలాగే మునగపాక గ్రామానికి చెందిన సూరిశెట్టి తేజ పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గణేష్‌ తల్లిదండ్రుల, చికిత్స పొందుతున్న తేజ తల్లిదండ్రుల కన్నీటిని ఆపడం ఎవ్వరి తరమూ కాలేదు. తమకు ఆసరాగా నిలబడతాడని అనుకున్న కుమారుడు మృత్యువాత పడటంతో గణేష్‌ తల్లిదండ్రులు ఆదినారాయణ, నాగమణి దంపతులు బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.
రోలుగుంట : చనిపోయిన వారిలో రోలుగుంట గ్రామానికి చెందిన సుర్ల జశ్వంత్‌ ఉన్నాడు. తమ కుమారుడు చదువు పూర్తి చేసుకొని తమను బాగా చూసుకుంటాడనుకున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.