
ప్రజాశక్తి-అచ్యుతాపురం : ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై తప్పుడు ప్రచారం చేయడం తగదని వైసీపీ నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైసిపి మండల అధ్యక్షులు దేశంశెట్టి శంకర్రావు, నాయకులు కోన బుజ్జి, చేపల వెంకటరమణ జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు నర్మల కుమార్, ఎలమంచిలి ఎంపిపి బోదేపు గోవింద తదితరులు సోమవారం పూడిమడకలో జరిగిన సంఘటనపై మాట్లాడారు. కన్నబాబురాజు రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక పార్టీకి చెందిన కొంతమంది తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. పూడిమడక గ్రామ సముద్ర తీరంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు, ఏషియన్ పెయింట్స్ నిధులతో హాస్పిటల్ నిర్మాణం, జెట్టీ నిర్మాణం, బ్రాండిక్స్ సహకారాలతో తీరంలో పారిశుధ్య నిర్వహణ వంటి అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కన్నబాబురాజు చేపడుతున్నారని చెప్పారు. పధకం ప్రకారం ఆయనపై దాడి చేయడం విచారకరమన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరనూ కలిసి పనిచేస్తేనే రానున్న ఎన్నికలలో విజయం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఒడిసెల శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు పిన్నమరాజు వాసు, బొద్దపు ఎర్రయ్య దొర, మారిశెట్టి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.