ప్రజాశక్తి-ఉక్కునగరం : అనారోగ్యంతో సోమవారం మృతిచెందిన సిఐటియు సీనియర్ నాయకులు ఉప్పిలి కన్నరావుకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఎన్.రామారావు నివాళులర్పించారు. మంగళవారం ఉదయం అగనంపూడిలోని కన్నారావు నివాసంలో ఏర్పాటుచేసిన సంతాప సభకు హాజరై విప్లవ వందనాలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణకు, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల, నిర్వాసితుల హక్కుల కోసం కన్నారావు అనేక పోరాటాలలో పాల్గొన్నారని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో సైతం అగనంపూడి నుంచి నిర్వాసితులను కదిలించి పోరాటాలను విజయవంతం చేశారని తెలిపారు. కన్నారావు మృతి పార్టీకి తీరని లోటఅన్నారు. ఆయనకు సిపిఎం, సిఐటియు తరపున నివాళులర్పించారు.










