Aug 01,2021 11:05

రక్తాన్ని పంచి
కంటికి రెప్పలా పెంచి
ప్రయోజకుల్ని చేయడానికి
త్యాగానికి మించి
జీవితాన్ని ధారపోసే
తల్లిదండ్రులకు వందనం

బిడ్డల కోర్కెలకు తలవంచి
వారి భవిష్యత్తునుగాంచి
బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నా
వెలుగుల్ని ప్రసరించే
సూర్యచంద్రులైన
అమ్మానాన్నలకు వందనం

వాళ్ళు వీళ్లంత వాళ్ళయ్యాక
పెద్దరికాన్ని వాళ్ళకి కట్టబెట్టి
కన్నబిడ్డల చాటు పిల్లల్లా
వాళ్ళ బతుకులకి భారం కాకుండా
ఉండాలని ఉబలాటపడుతుండే
మాతా పితురులకు వందనం

గంజి నీళ్లకు నోచుకోకున్నా
బిడ్డల భాగోతాల్ని బయట పెట్టకుండా
కన్నీళ్ళతో గూళ్ళు కట్టుకున్న
బరువైన రెప్పల్ని కదల్చకుండా
నాలుకని పళ్ళ మధ్య బిగించి
మాటలు జారనీయని
మౌన మునులైన
కన్న పేగులకు వందనం
 

యం యస్‌ రాజు
95020 32666