Nov 20,2023 21:12

వినతులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ

కన్న కొడుకే గెంటేశాడు..
- న్యాయం చేయాలని పోలీస్‌ స్పందనలో వృద్ధుడు మొర
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    'నా కొడుకు రఫీ నన్ను బాగా చూసుకుంటానని చెప్పి నాకున్న ఒక ఎకరం పొలం పేరున రాయించుకున్నాడు. ఆ తర్వాత ఎకరం పొలం అమ్మేశాడు. ఇప్పుడు నా కొడుకు నన్ను సాకలేనని ఇంటి నుండి గెంటివేశాడు. నేను ముసలి వాడిని. నాకు న్యాయం చేయండి' అంటూ బిలకలగూడూరు గ్రామానికి చెందిన షేక్‌.అబ్దుల్‌ అజీస్‌ పోలీస్‌ స్పందన కార్యక్రమంలో ఎస్‌పికి విన్నవించాడు. సోమవారం నంద్యాలలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి ఫిర్యాదిదారుల నుంచి మొత్తం 98 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ స్పందన ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఫిర్యాదులలో కొన్ని..
- 'నాకు బెంగళూర్‌లో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని మహేంద్ర నావద్ద నుండి రూ. 1 లక్ష 60 వేలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా రూ. 40 వేలు మాత్రమే ఇచ్చి మిగితా డబ్బులు ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు. న్యాయం చేయండి' అంటూ పెద్ద అయ్యలూరు గ్రామానికి చెందిన ఈ.రాజేష్‌ ఫిర్యాదు చేశాడు.
- 'నా పేరు శీలం.శ్రీనివాసులు. నేను వికలాంగుడిని. నేను నంద్యాల నుండి మా స్వగ్రామం వేంపెంట గ్రామానికి వెళ్తుండగా బండిఆత్మకూరు కరెంట్‌ ఆఫీసు వద్ద ట్రాక్టర్‌ డ్రైవరు అజాగ్రత్తగా నడిపి యాక్సిడెంట్‌ చేశాడు. ట్రాక్టర్‌ ఓనర్‌ రూ. 30 వేలు చికిత్స నిమిత్తం ఇచ్చారు. కానీ నాకు చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చు అయింది. నాకు న్యాయం చెయ్యండి' అని ఫిర్యాదు చేశాడు.
స్పందకు వచ్చిన ఫిర్యాదిదారులకు ఓంకారం దేవస్థానం వారిచే జిల్లా ఎస్‌పి భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ జి.వెంకట రాముడు, స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి జెవి సంతోష్‌, నంద్యాల తాలూకా సిఐ దస్దగిరి బాబు, సిఐలు చంద్రబాబు నాయుడు, సూర్యమౌళి తదితరులు పాల్గొన్నారు.