Nov 04,2023 21:23

కనికరమేదీ?

జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. ఖరీఫ్‌ తరహా వాతావరణ పరిస్థితులే రబీలోనూ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనల పేరుతో కరువును తగ్గించి చూసే ప్రయత్నం చేయడం విడ్డూరమనే చెప్పాలి. రాజకీయ కోణంలో కరువు పరిస్థితులను అంచనా వేయ కుండా వాస్తవ పరిస్థితులను మానవతా దృక్పథంలో పరిశీలన చేసి రైతాాంనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉరుముతోంది. వాతావరణంలో చిన్నమార్పు చోటుచేసుకున్నా రైతాంగమే ఎక్కువగా నష్టపోతున్నారనే విషయాన్ని గమనంలో ఉంచుకుని కరువు మండలాలను గుర్తించాలి. ఇటువంటి మావనతా దృక్పథాన్ని విస్మరించి, రాజకీయ కోణంలో కరువు మండలాలను గుర్తించడం విడ్డూరమనే చెప్పాలి. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో 17 మండలాల్లో కరువు పరిస్థితులు పతాకస్థాయికి చేరుకున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కరువు మండలాలను గుర్తించింది. కరువు మండలాల ప్రతిపాదనల్ని అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లాలోనే కరువు తాండవం చేస్తుంటే పాలకులు కళ్లు మూ సుకుని ఉన్నారనే విమర్శలు వస్తాయనే కోణంలో ఒక్క ప్రాంతాన్ని కరువు మండలముగా ఎంపిక చేయకపోవడం గమనార్హం. అన్నమయ్య జిల్లాలో 23 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. కరువు మండలాల ప్రతిపాదనల్ని అందజేసింది. జిల్లా అధికార యంత్రాంగం కేంద్రప్రభుత్వం పేర్కొన్న పారామీటర్ల మేరకు కరువు మండలాలను గుర్తించిన సంగతి తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం రాజకీయ కోణంలో పరిశీలించి కడప జిల్లాలో కరువు మండలాల గుర్తింపును ఉద్దేశపూర్వకంగా విస్మరించిందనే చెప్పాలి. ఇదేతరహాలో అన్నమయ్య జిల్లాలో 23 మండలాలకుగానూ 18 మండలాలకు కుదించడం విస్మయాన్ని కలిగించింది. ఒక్కో మాసంలో ఒకటి నుంచి రెండు డ్రైస్పెల్స్‌ నమోదు కావడం వంటి పారామీటర్లను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఎంపిక చేయకపోవడం విస్మయాన్ని కలిగించింది. ఇటువంటి రాజకీయ కుత్సితాలతో రైతాంగాన్ని ముడివేయడం అభ్యంతరకరమని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత రాజకీయ ధోరణుల్ని నిలదీస్తూ జిల్లా రైతాంగాన్ని రౌండ్‌ టేబుల్స్‌, ఇతర నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తేనే కరువు మండలాల సవరింపు ఉంటుందనే సంగతిని గుర్తించుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి ఉంది. ఇటువంటి బృహత్తరమైన ఉద్యమ కార్యకలా పాలను రైతు సంఘాల నాయకులు ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇటువంటి రాజకీయ కుత్సితాలను గుర్తించి ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శిస్తూ రైతాంగం రోడ్డుపైకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల నాయకత్వాలను రైతాంగ సమస్యలపై దృష్టి సారించేలా చేసినప్పుడే రైతు సంఘాల నాయకత్వాలు వర్థిల్లగలవని చెప్పవచ్చు.
- ప్రజాశక్తి - కడప ప్రతినిధి