Nov 23,2022 23:54

మహాసభలో మాట్లాడుతున్న ఆర్‌కెఎస్‌వి.కుమార్‌

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు కనీసవేతనం రూ.26వేలు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధిరక్షణ కోసం ఐక్య పోరాటాలకు కార్మికులంతా సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ పిలుపునిచ్చారు. ఎంవిపి గిరిజన భవనంలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ 9వ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభ ప్రారంభంలో సీనియర్‌ నాయకులు ఎస్‌.మాధవస్వామి జెండాను ఆవివిష్కరించారు. మహాసభకు అధ్యక్షవర్గంగా వి.కృష్ణారావు, కె.కుమారి, జెఆర్‌.నాయుడు వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తలు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కుమార్‌మంగళం మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామన్న ప్రభుత్వం మాటతప్పిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం ఇవ్వాలని ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు కేవలం రూ.6వేల నుంచి రూ.12వేలు మాత్రమే చెల్లించి దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కాంట్రాక్టర్ల వ్యవస్థ వల్ల కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్నారన్నారు. కనీసవేతనాల బోర్డు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు ప్రత్యక్షంగా సహకరించడాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న వైసిపి, టిడిపి, జనసేనలు పల్లెత్తుమాట కూడా మాట్లాడటం లేదన్నారు. కార్మికుల హక్కుల సాధనకోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మహాసభలో కార్యదర్శి పి.వెంకటరావు మూడేళ్లలో నిర్వహించిన పోరాటాలు- విజయాలపై నివేదిక ప్రవేశపెట్టారు. మహాసభ కార్యదర్శి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించింది. మహాసభ ప్రారంభానికి ముందు గత మూడేళ్ళ కాలంలో మరణించిన కార్మికవర్గ నాయకులకు, ప్రజాస్వామ్యవాదులకు సభ ఘనంగా నివాళులర్పించింది.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా జెఆర్‌.నాయుడు (మున్సిపల్‌), పి.వెంకటరావు, ఆఫీస్‌ బేరర్స్‌గా రామారావు (ఆర్‌టిసి), బి.కృష్ణ (ముఠా), వరలక్ష్మి (జివిఎంసి), ఎ.సింహాచలం (తోపుడుబండ్లు), సిహెచ్‌ పార్వతి (హాస్పిటల్స్‌), ఆలీ (ఆటో) ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 15 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.