Oct 11,2022 23:36

నూతనంగా ఎన్నికైన సిఐటియు మండల కార్యవర్గం

ప్రజాశక్తి మారేడుమిల్లి
అసంఘటిత రంగ కార్మికులకు, ఆశా, అంగన్వాడీ, మిడ్డేమీల్స్‌, విఒఎలు వంటి స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు మట్ల వాణిశ్రీ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో కొమరం చెల్లాయమ్మ అధ్యక్షతన జరిగిన సిఐటియు మండల మహాసభలో వాణిశ్రీ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌ రద్దుకై, కనీస వేతనం అమలుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈనెల 13న చింతూరులో జరగబోయే సిఐటియు ప్రథమ జిల్లా మహాసభకు అన్ని మండలాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులుగా కారం రామలక్ష్మి, కొమరం చెల్లయ్యమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఈతపల్లి సిరిమల్లె రెడ్డి, తీగల శ్రీనివాసులు, అంగన్వాడీ, ఆశ, మిడ్డేమీల్స్‌, వెలుగు విఒఎ తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.