ప్రజశక్తి - చీరాల
పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు డిమాండ్ చేశారు. మండలంలోని ఈపురుపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మూడు సంవత్సరాల నుంచి ఈపూరుపాలెం పంచాయతీలో వేతనాలు పెంచలేదని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని వేతనం పెంచాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఎండా, వానకు, పండగ సెలవు లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కార్మికులు పనిచేశారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.13వేలు కూడా ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. కార్మికుల విషయంలో కోర్టు తీర్పులు అమలు చేయాలని కోరారు. వేతనాలు పెంచకపోతే ఈనెల 18 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళతారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ యూనియన్ కన్వీనర్ ఇండ్ల చెంచయ్య, గడ్డం ప్రసాద్, తన్నీరు సీత, ఎ నవీన్, పి మూర్తీ, అంజయ్య పాల్గొన్నారు.










