Sep 09,2022 00:53

మాట్లాడుతున్న నరసింగరావు, పక్కన కోటేశ్వరరావు, రాము

ప్రజాశక్తి - అచ్యుతాపురం : బ్రాండిక్స్‌ కంపెనీ సహా అచ్యుతాపురం సెజ్‌లోని కార్మికులందరికీ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. ఈ నెల 20న అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలో గురువారం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వైఎస్‌.జగన్‌ ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలకు అండగా నిలుస్తోందని, ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కై కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. ధరలు ఆకాశాన్ని తాకుతుంటే కార్మికుల జీతాలు పాతాళానికి దిగజారుతున్నాయని అన్నారు. ఎస్‌ఇజెడ్‌లు ఏర్పాటు చేసిన ఈ ప్రాంతం ప్రజల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రోడ్లు, విద్య, వైద్యం కుంటుపడుతున్నాయని అన్నారు. కనీస సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కార్మికులకు అనుకూలంగా ఏ ఒక్క పనీ జరగడం లేదన్నారు. కార్మికుల జీతాల గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ సిఫార్సు చేస్తే తాము కార్మికులకు జీతాలు పెంచుతామని యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని చెప్పారు. కార్మికులు ఎనిమిది గంటలు నిల్చొని పని చేయాల్సి వస్తోందని అన్నారు. కార్మికులకు ఎటువంటి సదుపాయాలూ కల్పించడం లేదన్నారు. అత్యధిక లాభాలు సంపాదిస్తున్న ఫెర్రో, ఏషియన్‌ పెయింట్స్‌ తదితర వాటిల్లో కూడా కార్మికుల వేతనాలు ఆశించినంతగా లేవన్నారు. మోడీ ప్రభుత్వం రాకముందు గ్యాస్‌ ధర రూ.400 ఉండగా నేడు రూ.1100కు పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో వేసిన లెక్కల ప్రకారం నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తే వారంతా తిరగబడే రోజు వస్తుందన్నారు. స్థానిక బ్రాండిక్స్‌ కంపెనీలో విష వాయువులు లీకై రోజులు గడుస్తున్నా ఇంత వరకూ నిజాలు తేల్చకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ప్రమాదాలపై నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రాణాలను కోల్పోతే ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో ప్రతిఘటన తప్పదని అన్నారు. తన అనుభవంలో పలు కంపెనీలలో చోటుచేసుకున్న ప్రమాదాలకు సంబంధించి వేసిన కమిటీలు వాటి రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు ఉండేవన్నారు. అందుకు ఉదాహరణగా హెచ్‌పిసిఎల్‌, స్టీల్‌ప్లాంట్‌ తదితర ప్రమాదాలను ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నాయకులు రొంగలి రాము, కె.సోమినాయుడు పాల్గొన్నారు.