అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుప్రజ
ప్రజాశక్తి - ఏలూరు
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్.సుప్రజ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక అల్లూరు సత్యనారాయణ భవనంలో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం పి.సుజాత అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సుప్రజ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ వేతనాలు మాత్రం పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే చాలీచాలని వేతనాలతో జీవించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు మెటీరియల్ సక్రమంగా సరఫరా చేయకుండా అధికారులు తనిఖీల పేరుతో వేధించడం మానుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల మెరుగుకు ప్రభుత్వాలు నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంగన్వాడీలపైకి ఆ నెపాన్ని మోపుతుందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి పి.భారతి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సెంటర్ అద్దెలు, బిల్లుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు కె.విజయలక్ష్మి, పి.హైమావతి, పుష్ప, మాణిక్యం, సరోజిని, విమల, తులసి, విజిత, జాన్సీ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమస్యలు
పరిష్కరించాలని వినతి
కుక్కునూరు: పాలు, గుడ్లు, బాలామృతం అంగన్వాడీ కేంద్రాల్లోనే దించాలని, 2018 నుండి ఇప్పటి వరకూ ఉన్న పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయాలని సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి యర్నం సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అంగన్వాడీ ప్రాజెక్టు సమావేవానికి వచ్చిన సిడిపిఒ తులసికి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ మండలంలో నాయికలగూడెం, బండారిగూడెం, గుట్టపుతొగు, కొత్తూరు, కౌండిన్యముక్తి గ్రామాలకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల్లో స్టాక్ దించకుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్లో దించుతున్నారని, దీనివల్ల అంగన్వాడీలకు రూ.15 వందల వరకూ రవాణా ఛార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, అంగన్వాడీలు ఆర్.వి.రమణ, బాడిస సుజాత, కణితి మంగ, కారం రాధ, వర్స మంగ, మాధవి, రమాదేవి పాల్గొన్నారు.










