
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మున్సిపల్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయడంతోపాటు వారి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం.రవి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నాడు పని విరామ సమయంలో మండలంలోని ఎర్రబాలెంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ఎం.రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ, వారికి చాలీచాలని జీతాలు ఇస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు హామీనిచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు కేవలం రూ.12 వేల జీతామే ఇస్తున్నారని, ఇవి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. వేతనాల పెంపుదల, మధ్యంతర భృతి, కరువు భత్యం, హెచ్‌ఆర్‌ఎ అమలు చేసేందుకు ఇచ్చిన జీవో 1615 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్ కార్మికులందరికీ సమగ్ర చట్టం తేవాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం.రవి డిమాండ్ చేశారు. పెనుమాకలో శనివారం పని విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆర్.వేణు, కార్మికులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని బంగ్లా సెంటర్ నుండి పోలీస్ స్టేషన్, సినిమా హాల్ సెంటర్ వరకు మున్సిపల్ కార్మికులు ర్యాలీ చేశారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే పారిశుధ్య కార్మికులందర్నీ పర్మినెంట్ చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, ఈ పనిని రూ.లక్షలిచ్చినా ఎవరు చేయలేరని అన్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికీ హామీని నెరవేర్చలేదన్నారు. పారిశుధ్య కార్మికులకు ఉరితాడుగా మారిన ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. 11వ పిఆర్‌సి ప్రకారం వేతనాలివ్వాలని, చెప్పులు, సబ్బులు నూనెలు, యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. కె.సీతారామయ్య, బి.రామారావు, ఎం.ప్రతాప్, పి.సురేంద్ర, జి.నాగేశ్వరరావు, అనంతలక్ష్మి, మార్తమ్మ, జయేంద్ర, డి.పరమేశ్వరరావు, వెంకట్రావు, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.