ప్రజాశక్తి-డుంబ్రిగూడ:ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేపట్టిన ఉపాధి కూలీలకు రోజువారీగా కనీస వేతనం రూ.250ల వేతనం కచ్చితంగా చెల్లించే బాధ్యత టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లుదేనని జిల్లా డ్వామా పిడి రమేష్ రామన్ చెప్పారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి కూలీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొలతల వారీగా చూపించి పనులు కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ లేదని చెప్పారు. వారికి పనులపై అవగాహన కల్పించి దగ్గరుండి చేయించి కనీస వేతనం చెల్లించే బాధ్యత మీదేనని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వేతనం తగ్గే అవకాశం ఉండకూడదన్నారు. ఇకనుంచి అయినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కనీస వేతనం చెల్లించే విధంగా చూస్తారా! లేదా అంటూ సమాధానం చెప్పాలని పీడీ ప్రశ్నించారు. చెల్లించే విధంగా పని కల్పిస్తామనీ వారు చెప్పారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా సచివాలయ భవనాల నిర్మాణంకు జిల్లా వ్యాప్తంగా రూ.125 కోట్లు మంజూరై ఉందన్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లకు బిల్లులు కాకపోవడంతో భవనాల నిర్మాణం ఆలస్యం జరుగుతుందన్నారు. పనులు జరిగిన వాటికి తక్కువగా మెటీరియల్ బిల్లులు పెట్టడం సరికాదని, కాంట్రాక్టర్లు ఏ దశ వరకు నిర్మిస్తే దాని వరకు కచ్చితంగా బిల్లులు చెల్లించే విధంగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటే భవనాలు వేగవంతంగా పూర్తవుతాయని చెప్పారు. లేనిపక్షంలో జిల్లాకు మంజూరైన నిధులు వేరే జిల్లాలకు మళ్లింపు అయ్యే పరిస్థితి ఉంటుందని, దీంతో భవన నిర్మాణ పనులు మరో రెండు, మూడేళ్లు ఆలస్యం జరిగే అవకాశం ఉందని పీడీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడి పవన్ కుమార్, చిరంజీవి పడాల్ ఏ డిఎల్‌డి ఆర్‌పి ఉదరు కుమార్, సోషల్ ఆడిట్ ఎస్‌ఆర్పి సిహెచ్ రామచందర్రావు, ఎంపీడీవో నగేష్, ఏపీవో దొరబాబు, ఉపాధి సిబ్బంది, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.










