
ప్రజాశక్తి-అనకాపల్లి
జీవీఎంసీలో పనిచేస్తున్న క్లాప్ డ్రైవర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ క్లాప్ వాహనాల యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు, సిపిఎం మండల కన్వీనర్ గంట శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుందరినీ ఆప్కాస్‌లో చేరుస్తామని హామీ ఇచ్చిందని, నేడు స్వచ్ఛభారత్ క్లాప్ డ్రైవర్లుగా ఉన్నవారిని థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. క్లాప్ డ్రైవర్లందరినీ ఆప్కాస్‌లో కలపాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ సమస్యల పరిష్కరించాలని, జీవో నెంబర్ 7ను, హెల్త్ అలవెన్స్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో క్లాప్ వాహనాలన్నీ ఒకే వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. క్లాప్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయకపోతే ఈనెల 15 తర్వాత సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం క్లాప్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఏజెశివకూమార్, పి.సతీష్ కుమార్, కె.దుర్గారావు పాల్గొన్నారు.