'ఉపాధి'లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వెతలు
క్రమబద్ధీకరించాలని కోరుతున్న ఉద్యోగులు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం వివిధ రూపాల్లో ఛార్జీల భారం వేస్తోంది. ఇటీవల కరెంట్ బిల్లులు భారం ఎక్కువైంది. నాలుగేళ్లతో పోల్చుకుంటే గ్యాస్ రెట్టింపు అయింది. ఇంటి అద్దెలు, ఖర్చులు, పిల్లల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. కాని మా వేతనాలు పెరగడం లేదు. ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 మంది ఎపిఒలు, 20 మంది ఇంజినీరింగ్ కన్సల్టెన్స్(ఈసీ), 20 మంది జూనియర్ ఇంజినీర్లు (జెఇలుక్ష్మి, 160 మంది టెక్నికల్ అసిస్టెంట్స్(టిఎలు), 130 మంది కంప్యూటర్ ఆపరేటర్లు(సీవోలు), 1,060 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్(ఎఫ్‌ఎ)లు 17 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో అంకితభావంతో పని చేస్తున్నారు. 1,049 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనుల గుర్తింపు, అడిగిన వారందరికీ పని కల్పించడం, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని ఇవ్వడం, మస్తర్ల నమోదు పర్యవేక్షణ, సకాలంలో వేతనాలు మంజూరు చేయించడం వంటి విషయాల్లో వీరు కీలక పాత్ర వహిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో సుమారు 6.92 లక్షల జాబ్ కార్డులుండగా 48 వేల శ్రమ శక్తి సంఘాలున్నాయి.
చాలీచాలని వేతనాలు
దాదాపు 17 ఏళ్లుగా పనిచేస్తున్న వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వపరంగా కల్పించాల్సిన సౌకర్యాలు అందడం లేదు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్ల దీస్తున్నారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే కుటుంబ నిర్వహణ కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి, కనీస వేతనాలు ఇస్తుందని, సౌకర్యాలు కల్పిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జాబ్ చార్ట్ లేకపోవడంతో వెట్టి చాకిరీ చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ హోదాలొఓ్ల పని చేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది విశేష కషి కారణంగా సమకూరుతున్న మెటీరీయల్ నిధులతో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతోంది. ప్రభుత్వ సంకల్పమైన సచివాలయాలు ప్రతీ గ్రామంలో నిజరూపం దాల్చడానికి ఈ విధంగా సమకూర్చిన ఉపాధి నిధులే కారణం.అయితే అందుకు కష్టపడుతున్న ఉద్యోగుల సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం
రాష్ట్రంలోని పలు శాఖల్లోని సుమారు 11 వేల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తమ విధులను కూడా క్రమబద్దీకరించాలని సిబ్బంది కోరుతున్నారు. జిల్లా ఎంపిక కమిటీ (డిఎస్సి) ద్వారా వచ్చి, క్రమబద్దీకరణకై గతంలో సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే తమకు తగిన అర్హతలను ఉన్నాయని చెబుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్ల ఆధారంగా కూడా వీరి నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో అందరికీ 2010 పిఆర్‌సి ప్రకారం గ్రేడ్స్ ఫిక్స్ చేయాలని, అలవెన్స్‌లను బేసిక్ పేలో కలపాలని, పిఆర్‌సి-2022ను అమలు చేయాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని, నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు ముక్తకంఠంతో కోరుతున్నారు.










