Nov 20,2023 22:03

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఒక వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అందరికంటే తక్కువ వేతనం ఇవ్వడం ఏమిటని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కళ్యాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు విమర్శించారు. సోమవారం స్థానిక సొసైటీ రోడ్డులో ఉన్న సిడిపిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రిలే దీక్షలు నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఐసిడిఎస్‌ను రెగ్యులర్‌ చేయాలని, అంగన్వాడీలపై వేధింపులు ఆపాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సిడిపిఒ ప్రమోదినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కళ్యాణి, రారు మాట్లాడుతూ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు మరిచి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పుడు రూ.13,500 ఇస్తుంటే, మన రాష్ట్రంలో రూ.11,500 ఇస్తున్నారని తెలిపారు. అంగన్వాడీల ఓట్లు కోసం పచ్చి అబద్దాలు చెప్పారని నేటి పరిస్థితి చెప్పకనే చెబుతోందని విమర్శించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, నేతలు గార రంగారావు, కె.నళినిరాణి, రాజకుమారి, వసంత, మణి మాలతి, వెంకాయమ్మ, బి.సత్యవతి, డివిఎస్‌.ప్రభావతి, లక్ష్మి, మహేశ్వరి, పార్వతి, సత్యమాల, మధు షీలా పాల్గొన్నారు.
పెనుమంట్ర: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి కానూరి తులసి మాట్లాడారు. కార్యక్రమానికి కె.విజయలక్ష్మి, కె.మంజురాణి, జి.శ్రీదేవి, కె.కమల, వివివి.నాగలక్ష్మి, కె.దుర్గ, మౌనిక, వి.సరస్వతి, కె.సాయిమహాలక్ష్మి నాయకత్వం వహించారు. దీక్షలకు ఎపి కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్‌, సిపిఎం మండల కార్యదర్శి కూసంపూడి సుబ్బరాజు, సిఐటియు నేత ఆంజనేయులు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్‌ సంఘీభావం తెలిపారు.
పోడూరు: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పిల్లి ప్రసాద్‌, జవ్వాది శ్రీను, దేవ సుధాకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వి.ఉషారాణి, పీతల రాజమణి, బి.వెంకట్రావ్‌, శ్రీదేవి, ఉమాదేవి, కుమారి, నాగలక్ష్మి, రజని, పద్మావతి తదితరులు నాయకత్వం వహించారు.
మొగల్తూరు: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జి.పెద్దింట్లు, గుబ్బల రాజేశ్వరి, కె.భోగేశ్వరి, శ్రీలక్ష్మి, ప్రేమకుమారి, కె.కామాక్షి పాల్గొన్నారు.
పాలకోడేరు: విస్సాకోడేరు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా నాయకులు ఎమ్‌డి.హసీనా, సిఐటియు జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్‌ మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ నేతలు మహాలక్ష్మి, నాగరత్నం, నిర్మల, దుర్గ, వై.వెంకటలక్ష్మి, లక్ష్మి, శాంతికుమారి, తాయారు, సీతారత్నం, సావిత్రి, పద్మ పాల్గొన్నారు.
ఆకివీడు : పాదయాత్రలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని, హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సిడిపిఒ సెంటర్‌ వద్ద రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా సోమవారం స్థానిక సిడిపిఒ కార్యాలయం వద్ద దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకురాలు ఎస్‌కె.హసీనా అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.తవిటినాయుడు, అంగన్‌వాడీ అసోసియేషన్‌ నాయకులు కె.మార్తమ్మ, ఎస్‌కె.హసీనా, ఎ.సుబ్బమ్మ, పైడేశ్వరి, కుసుమ, ఝాన్సీ, ప్రమీల కృష్ణకుమారి పాల్గొన్నారు.
పెంటపాడు: అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రతిపాడులోని సిడిపిఒ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు దీన స్వరూప్‌రాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, నేత చిర్ల పుల్లారెడ్డి మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్‌ 8 నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌.అనురాధ, బి.జయలక్ష్మి, వి.కనకమహాలక్ష్మి, డి.ప్రభారాణి, వి.ప్రసన్న గాయత్రి, శ్రీదేవి, సిహెచ్‌.సీతామహాలక్ష్మి, జి.జయలక్ష్మి, పి.రాధారాణి, జి.వీరమ్మ, బి.శైలజకుమారి తదితరులు పాల్గొన్నారు.