Oct 22,2023 23:44

కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌కుమార్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కార్మికులకు ప్రభుత్వం నిర్ధేశించిన కనీస వేతనాల అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కనీస వేతనాలను నిర్ధారిస్తుంద న్నారు. ఈ మేరకు అక్టోబరు ఒకటి నుంచి మార్చి 31 వరకు అమలు చేయాల్సిన వేతనాలపై కార్మికశాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
ప్రభుత్వం జారీచేసిన కనీస వేతనాల వివరాలు?
కార్మిక శాఖ పరిధిలో ఉండే దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనాలను నిర్ధారిస్తూ ప్రభుత్వం అన్ని జిల్లాల కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్వల్ప పెరుగుదలలో కనీస వేతనాలను నిర్ధారిస్తారు. కార్మిక శాఖ కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం కనీస వేతనాల్లో కనిష్టం రూ.11,405 ఉండగా, గరిష్టంగా రూ.13,062 మాత్రమే ఉన్నాయి. జోన్‌-1 లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రేడ్‌1 మునిసిపాల్టీలు, జోన్‌-2లో గ్రేడ్‌2 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు ఉంటాయి. కనీస వేతనాల అమలు చేయకపోతే సంబంధిత వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకుంటాం.
ఈ-శ్రమలో ఎంత మంది నమోదయ్యారు?
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు 'ఈ-శ్రమ' పోర్టల్‌ను ప్రారంభించింది. గుంటూరు జోనల్‌ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో 17 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రూ.15 వేలు ఆదాయం లోపు కలిగిన వారు ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తించని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారు ఎప్పుడైనా ప్రమాదంలో మృతి చెందితే రూ.2 లక్షలు సాయం అందుతుంది. ఏ ప్రాంతంలో అయినా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అసంఘటిత రంగ కార్మికులు ఎంత మంది ఉన్నారనే అంశంపైనే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వీరి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న సచివాలయాలు, కార్మికశాఖ కార్యాలయాల్లో ఎవరైనా నమోదు చేసుకోవచ్చు.
వీరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారు?
అసంఘటితరంగ కార్మికులు ఈ-శ్రమ కింద నమోదు చేసుకుంటే వారు ఏ ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ రేషన్‌ ఇస్తారు. ఒన్‌ నేషన్‌ - ఒన్‌ రేషన్‌ విధానం ద్వారా ఎక్కడైనా రేషన్‌ కార్డు కూడా పొందవచ్చు. జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా ఆయా పథకాల్లో చేరవచ్చు.
బాలకార్మికుల నివారణ ఎలా ఉంది?
బాలకార్మికులను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖల సహకారంతో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. 14 ఏళ్ల లోపు వారిని దుకాణాల్లో పెట్టుకోకూడదు. 18 ఏళ్లలోపు వారిని కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లోనూ పెట్టుకోకూడదు. పాఠశాలల నుంచి వెళ్లి పోయిన వారిని గుర్తించేందుకు వాలంటీర్ల సహకారంతో ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు. దుకాణాలు, వ్యాపార సంస్థల్లో ఉంటే వీరిని గుర్తించి వారి సంరక్షణ బాధ్యతను శిశుసంక్షేమ శాఖకు అప్పగిస్తున్నాం. పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం.