ప్రజాశక్తి -పాడేరు:అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ 11 మండలాల్లో జరుగుతున్న (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) ఉపాధి హామీ పథకం పనుల్లో కనీస సదుపాయాలు కానరాలేదు. ప్రస్తుతం పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాడేరు, అరకు నియోజక వర్గాల్లోని 11 మండలాల్లో 1, 42, 393 జాబ్ కార్డుదారులకు 2023 సంవత్సరానికి నూరు రోజుల చొప్పున వివిధ ఉపాధి పనులు కల్పించారు. ప్రతి పంచాయతీలోనూ ఉపాధి పనులు సాగుతున్నాయి. ఈ పథకం కింద ఎంపిక చేస్తున్న పనుల్లో ఎక్కువగా ట్రైంచి తవ్వకాల పనులే కల్పిస్తుండటంపై పలుచోట్ల గిరిజనులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరం పొడుగునా తమ గ్రామంలో ఒకే రకమైన పని కల్పిస్తుండడంపై ఇరడాపల్లి పంచాయితీ లాడ పుట్టు గ్రామంలో ఉపాధి లబ్ధిదారులు బోధ మోహనరావు, ఉల్లి నాగేశ్వరరావు, మజ్జి నారాయణ, బోధ కృష్ణారావు, అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్వతాలపై ఆడవారితో కలిసి మీటర్ లోతు 5 మీటర్ల వెడల్పున రోజు ఈ ట్రెంచ్ తవ్వకాల పనులే చేస్తుండడం వల్ల తాము తరచు జ్వరాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. పనిచేసే చోట నీడ కరువవుతుందని ఎండలోనే ఈ తవ్వకాల పనులు నిర్వహిస్తున్నామని మెడికల్ కిట్లు, పనిముట్లు, టెంట్లు అందుబాటులో లేవని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఉదయం ఉపాధి పనులు చేసే వేళలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని లబ్ధిదారులు పేర్కొన్నారు.
పాడేరు ఏజెన్సీలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం కింద క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కొరత మూలంగా ఉపాధి పనుల కల్పనలో గిరిజన లబ్ధిదారుల అవసరాలకు తగ్గట్టుగా ప్రాధాన్యత పనులు కల్పనల్లో అంతరాయం కలుగుతుంది. అలాగే ఆర్‌ఓఎఫ్ పట్టాలు ఉన్న ఉపాధి పథకం జాబ్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు అదనంగా 50 రోజులు పని దినాలు కల్పించాలి. ప్రస్తుతం చాలామంది ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న జాబ్ కార్డ్ దారులకు ఈ పని దినాలు లభించడం లేదు. ఎక్కువగా ట్రెంచ్ తవ్వకాల పనులే ఉంటున్నాయని, వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా పనులు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రస్తుతం తాము చేసే ఉపాధి పనులతో కూలి సొమ్ము దక్కుతుంది. పర్వతాలపై ట్రైంచి తవ్వకాల వల్ల ప్రయోజనం చేకూరడంలేదని చెబుతున్నారు.
ఉపాధి పనులు చేసేందుకు పనిముట్లు సమకూర్చు కోవడానికి కూడా తాము సమస్యను ఎదుర్కొంటున్నామని గిరిజన లబ్ధిదారులు చెబుతున్నారు. పారా, గుణపం, పదును పెట్టించుకోవడానికి చాలా డబ్బు ఖర్చవు తోందని తెలిపారు.
కాఫీ తోటల్లో రాతికట్లు పని కల్పించాలి
తాము ఆర్‌ఓఎఫ్‌ఆర్ ద్వారా పొందిన అటవీ భూముల్లో సాగు చేస్తున్న కాఫీ తోటల్లో ఉపాధి పథకం ద్వారా రాతి కట్లు పనులు కల్పించాలని గిరిజన రైతులు బోధ నారాయణ అధికారులను కోరుతున్నారు. కాఫీ తోటల్లో ఈ రాతి కోటల పనులతో పశువుల బెడద లేకుండా కాఫీ తోటలకు రక్షణ కలుగుతుందని అలాగే అగ్ని ప్రమాదాలు కూడా తొలగుతాయని చెప్పారు. ప్రతి ఏటా ఉపాధి పనుల్లో మార్పులు చేయాలని, వ్యవసాయానికి అవసరపడే భూమి చదును పనులు, పంట కాలువల మరమ్మతు పనులు కూడా కల్పించాలని కోరుతున్నారు.
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి....
ఏజెన్సీలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.సుందర్రావు కోరారు. పనిచేసే చోట తాగునీరు నీడ సౌకర్యం కల్పించాలని, గునపం, పారా తదితర వాడికి డబ్బులు చెల్లించాలని, జాబ్ కార్డుదారులందరినీ గుర్తించి అదనంగా 50 రోజులు పని దినాలు కల్పించాలని, మందుల కిట్లు పంపిణీ చేయాలన్నారు. మేట్లకు సెల్ఫోన్, పారితోషకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










