ప్రజాశక్తి - నంబుల పూలకుంట : మండల కేంద్రంలో ఉండే ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు రోగులు వంద నుంచి 150 మంది దాకా వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో తాగడానికి నీరు కూడా లేవని వాపోతున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులు వైద్యుల కోసం గంటలు తరబడి వేచి చూడాల్సివస్తోందన్నారు. రోగులు అక్కడ కూర్చోవడానికి మౌలిక వసతులు లేవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, చెత్తాచెదరం నిండి ఉందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులతో నైనా కనీస సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు.










