May 20,2021 06:54

ఆన్‌లైన్‌ సేవలలో పనిచేసే వారు తమ కస్టమర్లతో ఏ విధంగానూ వ్యక్తిగత పరిచయాలు పెంచుకోకూడదు. కస్టమర్లకు, సేవలందించే వారికి నడుమ ఎంత కనీస స్థాయిలో వీలైతే అంతవరకూ అతి తక్కువ సంబంధం ఉండేలా చూడడం ఈ కంపెనీల విధానం. అందుకోసం తరచూ పాతవారిని తొలగించడం, కొత్తవారిని తీసుకోవడం చేస్తారు. కంపెనీకి, సేవలందించే పని వారికి మధ్య కూడా ఆన్‌లైన్‌ సంబంధాలే ఉంటాయి. తమకు న్యాయం జరగడంలేదని భావించిన పనివారు ఆన్‌లైన్‌ లో అభ్యంతరం తెలిపితే అది కూడా తీవ్ర క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడుతుంది.
   కరోనా కాలంలో డిజిటల్‌ వేదికల ద్వారా, ఆన్‌-లైన్‌ ద్వారా సేవలందించే కార్యక్రమాలు బాగా పెరిగాయి. ఓలా, ఉబర్‌ క్యాబ్‌ సర్వీసులు, అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ఏజన్సీల ద్వారా డోర్‌ డెలివరీ వ్యాపారం పెరిగింది. జొమాటో, స్విగ్గీ వంటి ఏజన్సీల ద్వారా హోం డెలివరీ ద్వారా ఫుడ్‌ ఐటమ్స్‌ అందించడం పెరిగింది. ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలను కూడా హోం డెలివరీ చేస్తున్నారు.
ఇదంతా చూసినప్పుడు ఈ డిజిటల్‌ వేదికల ద్వారా లావాదేవీలు పెరిగినందున కరోనా కాలంలో బాగా వృద్ధి చెందిన రంగం ఇది అని మనకు అనిపిస్తుంది. కాని ఈ రంగాన్ని ఈ కాలంలో అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు మాత్రం ఈ రంగంలో పనిచేసే వారు కరోనా కాలంలో బాగా దెబ్బ తిన్నారని వెల్లడిస్తున్నారు. ఆ అధ్యయనం వివరాలను ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ ఇటీవల ప్రచురించింది.
   ఆన్‌లైన్‌ సేవల పనుల్లో 2016 నాటికి 85 లక్షల మంది పని చేస్తూండగా వారి సంఖ్య 2018 నాటికి ఒక కోటి ఏభై లక్షలకు పెరిగిందని ఒక అంచనా.
   కరోనా కాలంలో ఈ డిజిటల్‌ ఆన్‌లైన్‌ వేదికలు వివిధ రకాల సేవలందించాయి. ఉబర్‌, ఓలా వంటివి వైద్య సేవలలో ఉన్న హెల్త్‌ కేర్‌ వర్కర్లకు రవాణా సౌకర్యం కల్పించాయి. జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్‌ కార్ట్‌ వంటివి ఉబర్‌ తదితర సంస్థలతో కలిసి మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందించాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్విగ్గీ గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో ఒక నెలలోనే 2,50,000 మందికి ఉచితంగా భోజనాలను అందించింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి. ఈ సమయంలో ఆన్‌లైన్‌ సేవల అవసరం పెరిగింది.
    అయితే ఈ కాలంలోనే స్విగ్గీ 1450 మంది ఉద్యోగులను తొలగించింది. జొమాటో 520 మందిని, ఓలా 1400 మందిని, ఉబర్‌ 600 మందిని, ఎయిర్‌ బిఎన్‌బి 1900 మందిని తొలగించాయి. ఉద్యోగులుగా ఈ సంస్థలు గుర్తించేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. పైన తెెలిపిన సంస్థలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య మొత్తం ఉద్యోగులలో 13 నుండి 25 శాతం ఉంటుంది. ఒక పక్క డిజిటల్‌ ఆన్‌లైన్‌ పనుల్లో కోటిన్నర మంది ఉన్నారని అంచనాలు ఉన్నాయి. మరోపక్క వారిలో ఉద్యోగులుగా పరిగణించబడేవారు మాత్రం వేలల్లోనే ఉన్నారు.
   వాస్తవానికి ఈ డిజిటల్‌ ఆన్‌లైన్‌ సంస్థలు తమ వద్ద పని చేసే వారిలో అత్యధికులను రోజువారీ ప్రాతిపదికన బిజినెస్‌ పార్ట్‌నర్లుగా పరిగణిస్తాయి. ఉదాహరణకు ఓలా లేదా ఉబర్‌ సర్వీసులలో క్యాబ్‌ డ్రైవర్లు బిజినెస్‌ పార్ట్‌నర్లుగా ఉంటారు. ప్రయాణీకుల నుండి క్యాబ్‌ చార్జీలు నేరుగా కంపెనీకి పోతాయి. అక్కడి నుండి కొంత సొమ్ము క్యాబ్‌ డ్రైవర్‌ కి ముడుతుంది. కంపెనీ లాభాలు సంవత్సరం చివర్లో లెక్కించినప్పుడు అందులో ఈ డ్రైవర్లకు కూడా వాటా వస్తుందని ఆశ చూపుతారు. కాని సంవత్సరమంతా కొనసాగేవారు ఎందరుంటారు? సంవత్సరం పొడవునా ఈ డ్రైవర్లకు కస్టమర్లను అందిస్తానని ఓలా కంపెనీ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? ఈ కరోనా సమయంలో బేరాలు లేక చాలామంది ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు కంపెనీని వదులుకున్నారు. తమ స్వంత వాహనాలనే వీరు ఉపయోగిస్తారు. వాటిని కొనుగోలు చేయడం కోసం బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులకు వాయిదాలు కట్టుకోలేక నానా అగచాట్లూ పడ్డారు.
   లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి సేవలను ప్రారంభించాక తమ వద్ద పని చేసేవారిని తిరిగి తీసుకున్నప్పుడు వారి సేవలకు చెల్లించే రేట్లను తగ్గించారు. దానికి తోడు వారికి అప్పజెప్పే పనులు కూడా తగ్గిపోయాయి. రోజుకు 16 నుండి 20 వరకూ డెలివరీ ఆర్డర్లు వచ్చే వారికి లాక్‌డౌన్‌ కాలం లోను, ఆ తర్వాత రోజుకు 6 నుండి 7 ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. రోజుకు 10 గంటల పాటు పని చేసినా అంతకు ముందు వచ్చే ఆదాయాలు ఇప్పుడు రావడం లేదు.
   కరోనా కాలంలో ఈ వర్కర్ల వ్యక్తిగత రక్షణకు అవసరమైన కనీస అవసరాలను (మాస్క్‌లు, శానిటైజర్లు వగైరా) కూడా ఈ కంపెనీలు ఏర్పాటు చేయలేదు. కాని వాటిని తప్పనిసరిగా ఉపయోగించి తీరాలని నిబంధనలను గట్టిగా అమలు చేశారు. క్యాబ్‌లో ఎక్కే ప్రయాణీకుడు ఎటువంటి జాగ్రత్తలూ పాటించనవసరం లేదు. దాంతో క్యాబ్‌ డ్రైవర్‌ కి రిస్క్‌ మరింత పెరిగింది. కంటైన్‌మెంట్‌ జోన్ల లోకి సైతం పోయి వీరి సేవలను అందించాల్సి వచ్చింది. అటువంటి వారికి కరోనా సోకితే రూ.30,000 ఇన్సూరెన్స్‌ ఇస్తామని కంపెనీలు ప్రకటించాయి కాని ఎక్కడా అమలు చేసిన పాపాన పోలేదు. కాని ఈ క్యాబ్‌ డ్రైవర్లను, హోం డెలివరీ బారు లను కరోనా యోధులు, హీరోలు అని పొగుడుతూ ప్రకటనలు జారీ చేసి కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు వాడుకున్నాయి.
   ఆన్‌లైన్‌ సేవలలో పనిచేసే వారు తమ కస్టమర్లతో ఏ విధంగానూ వ్యక్తిగత పరిచయాలు పెంచుకోకూడదు. కస్టమర్లకు, సేవలందించే వారికి నడుమ ఎంత కనీస స్థాయిలో వీలైతే అంతవరకూ అతి తక్కువ సంబంధం ఉండేలా చూడడం ఈ కంపెనీల విధానం. అందుకోసం తరచూ పాతవారిని తొలగించడం, కొత్తవారిని తీసుకోవడం చేస్తారు. కంపెనీకి, సేవలందించే పని వారికి మధ్య కూడా ఆన్‌లైన్‌ సంబంధాలే ఉంటాయి. తమకు న్యాయం జరగడంలేదని భావించిన పనివారు ఆన్‌లైన్‌ లో అభ్యంతరం తెలిపితే అది కూడా తీవ్ర క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడుతుంది.
   మొత్తంగా చూసినప్పుడు వివిధ రకాల ఆన్‌లైన్‌ సేవలలో పనిచేసే వారు సంఖ్య రీత్యా ఎక్కువే ఉన్నా, వారు సంఘటితపడే అవకాశాలు లేని విధంగా వారి సర్వీసు కండిషన్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వీరికి రక్షణ, భద్రత, కనీస వేతనాలు వంటివి కల్పించే విధంగా చట్టాలు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఉద్యమాలు అవసరం.