ప్రజాశక్తి -మధురవాడ :సేవ, ఉత్పత్తిరంగంలో సేవలందించిన విశ్రాంత ఉద్యోగులకు కనీన పింఛను రూ.9వేలు చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయిన్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఎనిమిదోవ ఆర్డు బిందానగర్, సుందరయ్య పార్కులో రెడ్డిపల్లి బాబూరావు అధ్యక్షతన నిర్వహించిన పెన్షనర్స్ యూనియన్ విశాఖ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పెన్షనర్లను నిరాశపరిచేదిగా ఉందని, 2014కు ముందు ఉద్యోగ విరమణ చేసిన వారికే వర్తిసుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రైవేటు, సొసైటీల్లో పనిచేసి రిటైరైన వారికి రూ.మూడు వేలు పింఛను రావడం కష్టమౌతోందన్నారు. ప్రస్తుతం ధరాభారం, పన్నుల మోతలో పెన్షనర్ల జీవనం ఎలా సాగుతుందో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఈ నేపథ్యంలో కరువు భత్యం, ఇతర సౌకర్యాలతో కనీన పింఛను రూ.9వేలు చెల్లించాలని కోరుతూ ఈనెల 16న జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వచ్చేనెల 7, 8 తేదీల్లో పెన్షనర్ల సమస్యలపై ఢిల్లీలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు వి తులసీరాం, ఇ.శేషగిరిరావు, వి అప్పారావు, ఆర్.బాబురావు, వై అప్పారావు, సిఐటియు నాయకుడు డి.అప్పలరాజు పాల్గొన్నారు.










