ప్రజాశక్తి -కంచరపాలెం : కనీస పెన్షన్ అమలు తదితర సమస్యలపై ఆల్ ఇండియా కో-ఆర్డినేట్స్ కమిటీ పిలుపుమేరకు మర్రిపాలెంలోని పిఎఫ్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఆర్‌పిఎ విశాఖపట్నం గౌరవాధ్యక్షులు బిటి.మూర్తి మాట్లాడుతూ, ఇపిఎఫ్ 95 పెన్షనర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కనీస పెన్షన్ రూ.9 వేలుతో పాటు డిఎ, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్‌చేశారు. సంఘం ఉపాధ్యక్షులు యువిఎస్‌ఎన్ వర్మ మాట్లాడుతూ, పెన్షన్‌పై రిజర్వులో ఉంచిన తీర్పును వెంటనే విడుదల చేయాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె హుస్సేన్ మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్లు రుణాలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు అతి తక్కువ పెన్షన్‌తో అనేక ఇబ్బందులు పడుతున్న ఇపిఎఫ్ 95 పెన్షనర్లకు పెంచకపోవడం తగదన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకరరావు మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా, నిరసనలు తెలిపినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిపై డిసెంబర్‌లో ఢిల్లీలో ఒకరోజు ధర్నా, ఒక రోజు సదస్సు కార్యక్రమాలను నిర్వహించేందుకు జాతీయ కార్యవర్గం నిర్ణయించిందని, దానికి సంఘం సభ్యులు హాజరై నిరసన గళం వినిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పిఎఫ్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కె.దీనబంధు అధ్యక్షతన సాగిన ధర్నాలో అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.










