May 02,2023 23:39

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జగన్‌ తదితరులు

ప్రజాశక్తి -గాజువాక : వైజాగ్‌ పోర్టులో మాదిరిగానే ఆదాని గంగవరం పోర్టులో కార్మికులకు, కనీస జీతం రూ.36 వేలు చెల్లించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.జగన్‌, ఉపాధ్యక్షులు కొవిరి అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు డిమాండ్‌ చేశారు. గాజువాకలోని ఎస్‌బిటి హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, రూ.36 వేలు జీతం ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.1500 నుంచి రూ.2500 మాత్రమే ఇంక్రిమెంట్‌ వేయడంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు రూ.13 వేలు నుంచి రూ.16,600, ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు రూ.9,000 నుంచి రూ.9,800 వేతనాలు చెల్లించడం దారుణం అన్నారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఇచ్చిన రూ.3700 బేసిక్‌ నేటికీ కొనసాగుతోందని తెలిపారు. 14 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న కార్మికులకు కూడా బేసిక్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు. గంగవరం పోర్టు నిర్మాణంలో సర్వం త్యాగం చేయడం ద్వారా నియమితులైన నిర్వాసిత ఉద్యోగులకు పేరుకే పర్మినెంట్‌ అని, జీతభత్యాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. కనీసం ప్రతి ఏడాదీ ఇస్తున్న ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చెల్లించడం లేదన్నారు. ఆదాని గంగవరం పోర్టులో కార్మికులకు చట్టపరమైన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పక్కనే ఉన్న విశాఖ పోర్టు, స్టీల్‌ప్లాంట్‌లో పర్మినెంట్‌ కార్మికులకు ఇస్తున్న వేతనాల్లో సగం కూడా గంగవరం పోర్టు కార్మికులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఎవరినైనా ప్రశ్నిస్తే యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మెమోలు, ఛార్జిషీట్‌ లిస్టు తదితర ఏదో ఒక షాకుతో ఉద్యోగాలు తొలగిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి విశాఖ వస్తున్న సందర్భంగా ఆదానితో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. కార్మికులతో సమావేశం ఏర్పాటుచేసి ఇంక్రిమెంట్లు, వేతనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించిన గంటపల్లి లక్ష్మయ్య, కదిరి భూలోకరావును విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పేర్ల నూకరాజు, వాసుపల్లి యల్లయ్య, కదిరి సత్తిరాజు, మాదా అప్పారావు, కోనేటి వెంకటరమణ, గంటిపిల్ల అమ్మోరు, అప్పారావు, కదిరి తాతారావు పాల్గొన్నారు.