Apr 09,2023 21:42

'సర్‌ సిఆర్‌ఆర్‌'లో అవగాహన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్‌ పార్ధసారధి
ప్రజాశక్తి - ఏలూరు

               హిమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్‌ ఆధ్వర్యంలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా ఆదివారం సర్‌ సిఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మానవుని శరీరంలో రక్తం ప్రాముఖ్యత, రక్తకణాల పెరుగుదల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఎంబిఎస్‌వి.ప్రసాద్‌ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ హిమోఫిలియా కనపడని అంగవైకల్యమన్నారు. గత మూడు దశాబ్దాలుగా హిమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఉచితంగా రక్తమార్పిడి, శస్త్ర చికిత్సలు చేయటంతో పాటు మందులు అందించామని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్‌ నళిని పార్థసారధి అందించన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథి, పద్మశ్రీ నళిని పార్థసారధి మాట్లాడుతూ మొదట వైద్యరంగంలో చిన్న పిల్లల స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పాండిచ్చేరిలో జీవితం ప్రారంభించి సేవలు అందిస్తున్న సమయంలో హిమోఫిలియా సమస్యలు, వాటికి సరైన వైద్యం, సాంకేతికత లేని సందర్భంలో ఆ విషయాల మీద కేంద్రీకరించి కృషి చేసినట్లు చెప్పారు. గత 30 సంవత్సరాలుగా హిమోఫిలియా సొసైటీని ప్రారంభించి భవనాలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తన సహాయ సహకారాలు, మిత్రులు, స్నేహితుల సహాయంతో ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకొని హిమోఫిలియా బాధితులకు చికిత్స, శస్త్రచికిత్సలు చేస్తూ పలు సేవలు దేశవ్యాప్తంగా అందిస్తున్నామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మశ్రీ అవార్డ్‌ హిమోఫిలియా సొసైటీకి, దానిలో పనిచేసిన అందరికీ చెందిందన్నారు. అనంరతం పార్థసారధిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యనిపుణులు డాక్టర్‌ వంశీకృష్ణ, సర్‌ సిఆర్‌ఆర్‌.డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్స్‌ డాక్టర్‌ కెఎస్‌.విష్ణుమోహన్‌, కానాల శ్రీనివాసరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెఎ.రామరాజు, పిజి కోర్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెవిఆర్‌ఎన్‌ఎస్‌.కొందయ్యరావు, మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ పి.శైలజ, అధ్యాపకులు డాక్టర్‌ రాము, ఝాన్సీ మాట్లాడారు. సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఎంబిఎస్‌వి.ప్రసాద్‌ను అభినందించారు. 700 మంది హిమోఫిలియా పేషంట్స్‌ వారి తల్లదండ్రులు, సొసైటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.