Nov 08,2023 21:04

నారాయణపట్నం కాలువలో పేరుకుపోయిన మురుగు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. దీంతో గ్రామాలు దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. ముఖ్యంగా పెద బూరాడ పేట, నారాయణపట్నంలో ఏ కాలువ చూసినా మురు గుతోనే దర్శన మిస్తున్నాయి. అసలు ఈ గ్రామంలో ఒక్కసారి కూడా పారిశుధ్యం పనులు చేసిన పరిస్థితి లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నో రోజులుగా కాలువల్లో మురుగు తొలగింపు చేయక పోవడంతో నిండిపోయి వీధుల్లో రహదారి పైన మురుగు నీరు పారుతుంది. దీంతో డయేరియా, డెంగీ వంటి అంటు రోగాలు ప్రభలే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఏటి అగ్రహారం, సారిపల్లి గ్రామాల్లో పారిశుధ్య లోపంతో డయేరియా ప్రబలి చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం ఒక పక్క జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నా పారిశుధ్యంపై మాత్రం మాత్రం దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు. గ్రామాలకు మెరుగైన సేవలు అందించడానికి సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ పారిశుధ్యం వంటి సేవలు అందకుండా పోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త, వ్యర్ధాలు వీధుల్లో రహదారి మీదే దర్శన మిస్తున్నాయి. వాలంటీర్లు, సచి వాలయం సిబ్బంది ఉన్నా ఎవరూ పారిశుధ్యం పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికార్లు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టి అంటు రోగాలు నివారించాలని కోరుతున్నారు.