May 06,2023 00:06

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము

ప్రజాశక్తి - అచ్యుతాపురం
రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం కంపెనీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము డిమాండ్‌ చేశారు. దేవించియల్‌ స్కూల్‌లో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాము మాట్లాడుతూ ప్రభుత్వ చట్టాన్ని అచ్చుతాపురం ఎస్‌ఇజెడ్‌, రాంబిల్లి ఎన్‌ఎఒబి, పరవాడ ఫార్మాసిటీ కంపెనీలలో అమలు చేయడం లేదన్నారు. ఆ కంపెనీల కోసం స్థానికులు తమ భూములను, ఇళ్లను త్యాగం చేశారని తెలిపారు. కంపెనీల నుండి వచ్చే కాలుష్యం వల్ల స్థానికులు కేన్సర్‌, కిడ్నీ, లివర్‌, టిబి వంటి అనేక రోగాల బారిన పడుతున్నారని, దుమ్ముధూళి, వాహనాల రద్దీ వల్ల స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న స్థానికులకు 75 శాతం ఉద్యోగాల చట్టాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రెజ్లర్ల పట్ల మోడీ ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందన్నారు. రెజ్లర్లకు తమ సంఘం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.సోము నాయుడు, సహాయ కార్యదర్శి సిహెచ్‌.శివాజీ, జిల్లా నాయకులు ఎన్‌.నారాయణ, సిహెచ్‌.నూకన్న, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.