పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. రైతాంగమే కాదు. ఈ మిరప పంట మీద ఆధారపడి బతికే లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఒక్క గుంటూరు జిల్లా లోనే ప్రతి యేటా 50 వేల మంది వలస కూలీలకు ఉపాధి దొరుకుతోంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ యేడు మిరప పంటను పూర్తిగా నష్టపోయిన పంటగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిహారం చెల్లించాలి. ప్రతి ఎకరానికి లక్ష రూపాయలకు పైగా నష్ట జరిగింది. వాతావరణ బీమా పథకాన్ని వర్తింప చేస్తే బీమా పరిహారం వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి.
కౌలు రైతు లక్ష్మీ నరసింహారావు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ల గ్రామస్థుడు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో మిరప పంట వేశాడు. తామర పురుగు వల్ల పంట దెబ్బ తింది. మూడెకరాలకు కౌలుతో పాటు మూడున్నర లక్షలు పెట్టుబడి పెట్టారు. ఒక్క రూపాయీ రాదు. మరో మూడు ఎకరాల్లో పత్తి పంట వేస్తే కొంత పంటను గులాబి రంగు పురుగు తినేసింది. మిగిలిన కొంత పంటలో ఆధిక వర్షాల కారణంగా ఉన్న పత్తికాయలు కుళ్లిపోయాయి. ఇందులో రెండు ఎకరాలు కౌలు తీసుకున్నారు. ఆ రైతుకు 15 లక్షల అప్పు ఉంది. ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి.
మల్లవరపు మాధవరావు కౌలు రైతు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం, తునికిపాడు గ్రామస్థుడు. రెండున్నర ఎకరాలను మిర్చి పంట వేయడానికి రూ.80 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నాడు. తామరపురుగు సోకి మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. పంటను రక్షించుకునేందుకు మాధవరావు వారం రోజుల్లో రూ.15 వేల విలువైన మందులు పిచికారీ చేశాడు. ఫలితం లేదు. రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టాడు. పదేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నది ఊడ్చి పెట్టుకుపోవడమేగాక లక్షల్లో అప్పు తేలింది. ఆరుగురు కుటుంబ సభ్యులను ఎలా బతికించుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో అతడు కొట్టుమిట్టాడుతున్నాడు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఫెస్టిసైడ్ షాపులవారు.. పురుగు మందులు ఎక్కువగా కొడితే పంటను కాపాడుకోవచ్చని సంబంధం లేని పురుగు మందులను రైతులకు అంటకడుతున్నారు. ఆశతో పురుగు మందులు కొని పిచికారీ చేస్తున్నారు. షాపువారికి అప్పులు కూడా పెట్టడానికి లేదు. రొక్కం చెల్లించి మరీ పురుగు మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. మిర్చి పండించే ప్రాంతాల్లోని పురుగు మందుల షాపుల్లో రసాయన మందులు, బయో ఉత్పత్తులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. పురుగు మందుల షాపుల వారికి కాసులు మిగుల్చుతుంటే మిర్చి రైతులకు కన్నీరే మిగులుతోంది.
ఒక వైపు అధిక వర్షాలు, కల్తీ, నాశిరకం విత్తనాలు. మరోవైపు వైరస్, తామర పురుగు వలన మిరప వేసిన రైతులు కుదేలు అవుతున్నారు. ఏ జిల్లాలో చూసినా మిర్చి రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. ఏ రైతును పలకరించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. కళ్ళ ముందే పంట నాశనమవుతుంటే దిక్కు తోచని పరిస్థితి. వ్యవసాయ ఆధికారుల సూచనలు లేవు. ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావటంలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి చివరికి దున్నేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎకరానికి రూ.30 వేలు నుండి రూ.40 వేలు ముందుగానే కౌలు నగదు రూపంలో చెల్లించి చేలో దిగాలి. పంటకు మరో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వవు. రెండు నుంచి మూడు రూపాయలకు వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టారు. బొబ్బర తెగులు (జెమిని వైరస్)కు తామర పురుగు తోడైంది. కొన్నేళ్లుగా జెమిని వైరస్ ఉధృతంగా ఉంది. ఇది సోకిన మిరప మొక్కల ఆకులు మడతలు పడి కుంచించుకుపోతున్నాయి. ఆ మొక్కలు తొలగించినా ఫలితం ఉండటం లేదు. కొత్తగా వచ్చిన తామర పురుగు మిరప పంటను ఆశించి పూతను త్రీవంగా నష్టపరుస్తోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదు. మరో గత్యంతరం లేక పంటను దున్నేస్తున్నారు. నిరుడు మిరప పంటకు మంచి ధర ఉండటంతో ఎక్కువ మంది మిరప పంట వైపు మొగ్గారు.
2021-22 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో 4 లక్షలా 59 వేల ఎకరాల్లో మిరప వేశారు. నిరుడు కంటే ఈ యేడు 1.11 లక్షల ఎకరాల్లో ఎక్కువగా మిరప సాగైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2.41 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 94 వేలు, కర్నూలు జిల్లాలో 58 వేలు, కృష్ణా జిల్లాలో 35 వేల ఎకరాల్లో మిరప సాగు జరిగింది. మూడేళ్ళుగా మిరప పంట సాగు పెరుగుతూ వచ్చింది. మన రాష్ట్రంలో మిరప సాగులో 90 శాతం కౌలు రైతులే ఉన్నారు. 2019లో 3.40 లక్షలు, 2020లో 3.47 లక్షలు, 2021లో 4.58 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. దీనికి కారణం నిరుడు గులాబీ రంగు పురుగు వల్ల పత్తి పంట దెబ్బ తినటంతో కటకట ఏర్పడి మిర్చి పంటకు ధర బాగా వచ్చింది. దీంతో సాగుదార్లు మిరప వైపు మళ్ళారు. ప్రపంచం లోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత దేశానికి మంచి పేరుంది. మిరప ముఖ్యమైన వాణిజ్య పంట. దేశంలో 9 నుంచి 10 లక్షల హెక్టార్లలో మిరప సాగవుతోంది. 18.72 లక్షల టన్నులు దిగుబడి వస్తోంది. ఉత్పత్తిలో దేశంలోనే అత్యధిక ఉత్పాదకత ఒక హెక్టారుకు 3468 క్వింటాళ్లతో ప్రథమ స్థానంలో ఉంది. మిరప పంట పండించడంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 5.14 లక్షల టన్నులు పంట పండిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో ఈ పంట పండుతోంది. భారత్ నుండి మిరపను శ్రీలంక, అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, సింగపూర్, జర్మనీ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంతో పాటు చైనా, పాకిస్తాన్, మొరాకో, టర్కీ, బంగ్లాదేశ్‌లు పోటీదారులుగా ఉన్నాయి.
ఈ కొత్తరకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశం లోకి ప్రవేశించినట్లు డాక్టర్ వై.ఎస్.ఆర్.హెచ్.యు వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకి రామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.వి.ఎస్.కె రెడ్డి తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామర పురుగులు సొల్‌నేసియా కుటుంబానికి చెందిన మిరపతోపాటు టొమాటో, వంగ, బంగాళదుంపల వంటి కూరగాయల మొక్కలను, అలంకరణ మొక్కలను ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. నిరుడు జనవరి, ఫిబ్రవరిల్లో మన రాష్ట్రంలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా ఈ తామరపురుగు ఆశిస్తున్నట్లు ఉద్యానవన పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ లోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో తామర పురుగు ఆశించి పంట నష్టపరుస్తోంది. 2015 లోనే ఈ తామర పురుగు వచ్చినప్పుడు దీన్ని నివారించడంలో శాస్త్రవేత్తలు ఏం చేశారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. రైతాంగమే కాదు. ఈ మిరప పంట మీద ఆధారపడి బతికే లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఒక్క గుంటూరు జిల్లా లోనే ప్రతి యేటా 50 వేల మంది వలస కూలీలకు ఉపాధి దొరుకుతోంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ యేడు మిరప పంటను పూర్తిగా నష్టపోయిన పంటగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పరిహారం చెల్లించాలి. ప్రతి ఎకరానికి లక్ష రూపాయలకు పైగా నష్టం జరిగింది. వాతావరణ బీమా పథకాన్ని వర్తింపచేస్తే బీమా పరిహారం వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే రైతులు, కౌలు రైతులకు త్రీవంగా నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవి పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. వెంటనే ప్రభుత్వం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించి రైతాంగానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులకు ఉంది.
పి. జమలయ్య - / వ్యాసకర్త : ఎ.పి కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి /











