Dec 06,2022 23:40

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి, ఎంపిడిఒ ఫణీంద్ర తదితరులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం
మండలంలోని కుందులూరు పంచాయతీలో మంగళవారం ఎంపిడిఒ ఫణీంద్రతో కలిసి ఎంపిపి ఎంపీపీ కారం లక్ష్మి పర్యటించారు. గ్రామంలో వాటర్‌ ట్యాంకును వారు పరిశీలించారు. గ్రామంలో మంచినీటి సమస్యను ఎంపిడిఒకు ఎంపిపి వివరించారు. అనేక నెలలుగా గ్రామస్తులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, దీనిపై పలుమార్లు స్థానిక గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారని, అయినా నేటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. దీంతో ఎంపిడిఒ స్థానిక ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, సంబంధిత అధికారులను మందలించారు. వెంటనే వాటర్‌ ట్యాంకుకు మరమ్మతులు చేసి మంచినీరు ఇవ్వాలని, లేకుంటే మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం దయ్యాల మడుగు, కన్నంపేట మధ్యలోని వాగును ఎంపిపి, ఎంపిడిఒ పరిశీలించారు. ఈ వాగు వద్ద చెక్‌ డ్యాం నిర్మిస్తే వాగు ఆయుకట్టు భాగంలో ఉన్న సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించాలని ఎంపిపి కోరారు. దీనిపై ఎంపిడిఒ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి, వాగుపై చెక్‌ డ్యాం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుందులూరు, జల్లివారి గూడెం గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్న బాబు, నాయకులు గుండెపూడి లక్ష్మణరావు, రవ్వ బుచ్చయ్య, కార్యదర్శి, సర్పంచ్‌ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.