ప్రజాశక్తి-కందుకూరు :అన్ని రకాలుగా వెనుకబడ్డ కందుకూరు నియోజకవర్గ ప్రజల బాగుకోసం, భావితరాల భవిష్యత్తు కోసం పాలకులు ఏం చేశారో చెప్పాలని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ గానీ, మరేదైనా ఉపాధి అవకాశాలు గానీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా కందుకూరులోని టిడిపి కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని సోమవారం ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అధిక సంఖ్యలో మహిళలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలదొక్కుకునేలా, తమ కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ఏదైనా చెయ్యాలనే ఉద్ధేశ్యంతో ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత 50 మంది సోదరీమణులకు శిక్షణ మొదలుపెట్టామన్నారు. రెండు నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. ఇకనుంచి ఈ శిక్షణా కేంద్రం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం, మహిళలకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. రాబోయే టిడిపి ప్రభుత్వంలో కందుకూరు ప్రాంతాన్ని ఇండిస్టియల్ హబ్ గా మార్చేందుకు టిడిపి స్పష్టమైన ఆలోచనతో ఉందని నాగేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ పరిశీలకురాలు కె. కుసుమకుమారి మాట్లాడుతూ కుట్టుశిక్షణ కేంద్రం ఏర్పాటు విషయం గొప్ప ఆలోచన అన్నారు. మంగళగిరి తర్వాత మొదటిసారిగా కందుకూరులో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక అభివద్ధి కోసం తపిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావుకి మహిళలందరూ తోడ్పాటుగా నిలిచి, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నాగేశ్వరరావును గెెలిపించుకోవాలని సూచించారు. కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు నాదెండ్ల వెంకట సుబ్బారావు, పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు షేక్ రఫీ, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, పార్లమెంట్ కమిటీ నాయకులు బత్తిన ఆదెమ్మ, కందుకూరు పట్టణ మహిళా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముచ్చు లక్ష్మీరాజ్యం ఉన్నారు.










