ప్రజాశక్తి-అనకాపల్లి
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా తొక్కిసిలాటలో మృతి చెందిన ఎనిమిది మందికి గురువారం టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల అనుమతితోనే తమ నాయకులు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని, బందోబస్తు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్ రెడ్డి హయాంలో 173 మంది వివిధ సంఘటనలో చనిపోయారని, దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరే సతీష్, కుప్పిలి జగన్మోహన్‌రావు, మారిశెట్టి శంకర్రావు, బుద్ధ భువనేశ్వరరావు, విల్లూరి సత్యనారాయణ, వరప్రసాద్ పాల్గొన్నారు.
కందుకూరు ఘటన టిడిపికి బ్లాక్ డే
కందుకూరు ప్రమాద ఘటన టిడిపికి ఒక బ్లాక్ డే అని మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం మృతి చెందిన కార్యకర్తలకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ల సురేంద్ర, పోలవరపు త్రినాథ్, ఎంపీటీసీ సభ్యుడు తోటాడ విజరు, ధనాల విష్ణు చౌదరి, తలారి కాశీనాయుడు, మేడిశెట్టి నూకరాజు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
వడ్డాది : కందుకూరు సభలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఆ పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్య బాబు అన్నారు. బుచ్చయ్యపేట మండలం వడ్డాది టిడిపి కార్యాలయంలో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో లోపూడి ఎంపిటిసి యల్లపు జగ్గారావు, టిడిపి నాయకులు శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.










