ప్రజాశక్తి - పెద్దాపురం
సమాజాన్ని పట్టిపీడిస్తున్న సాంఘిక దురాచారాలపై రాజీలేని పోరాటం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజ చైతన్యం కోసం కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు బి.అనంతరం అన్నారు. సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఆదివారం ప్రజానాట్య మండలి మండల కార్యదర్శి రొంగల వీర్రాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆనాటి సమాజ పురోభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న అన్ని అంశాలపై తన రచనలు, నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన విశేష కృషి చేశారన్నారు. సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాథం మాట్లాడుతూ సమాజ వికాసం కోసం తన రచనలను అంకితం చేసిన కందుకూరి జన్మదిన రోజున తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకోవడం సమాజ చైతన్యానికి ప్రతీక అన్నారు.తెలుగు నాటక రంగం సమాజంలో తీసుకొచ్చిన చైతన్యం అనేక పోరాటాలకు స్ఫూర్తిని చ్చిందన్నారు. సంఘసంస్కర్తల జీవితా లను అధ్యయనం చేసి వారి బాటలో మరింత ముందుకు నడవాలన్నారు. ఉపాధ్యాయుడు కెనడి మాట్లాడుతూ వీరేశలింగం పంతులు రచనలు, నాటికలు,నాటకాలు, ఆయన ఆధ్వర్యంలో జరిగిన వితంతు వివాహాలు వివరించారు. ఈ సభ కార్యక్రమానికి ముందు వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్దింటి సీతన్న,దారపు రెడ్డి కష్ణ,మహాపాతిన రాంబాబు,దారపురెడ్డి సత్యనారాయణ, ఉపాధ్యాయుడు ప్రసాద్, సుబ్బలక్ష్మి, యాసలపు రమేష్, నిహారిక, అమృత, నమ్రత, అఖిల, నిఖిల, గూనూరు వెంకటరమణ, ధరణి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ : సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో సాహితీ వేత్త డాక్టర్ శిరీష, వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్ పాల్గొన్నారు.
కాకినాడ కార్పొరేషన్ అల్లూరి సీతారామరాజు స్మార్క్ కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పంపన దయానంద బాబు ఆధ్వర్యంలో నాటక రంగంలో సేవలు అందిస్తున్న పదిమందికి పైగా కళాకారులను సన్మానించారు.










