Jan 30,2022 12:35

ఇంటి వెనకాలవుండే పెరడు లేదు
వీధుల్లో వుండే రచ్చబండ లేదు
ఇంటి చుట్టూ హద్దులు గీసిన..
గోడలు మొలుస్తున్నాయి
మనిషికీ మనిషికీ మధ్య అహంకారాలు మొలిచినట్లు
ప్రేమగా పిలిచే మాటల్లేవు ఇపుడు
సహాయం చేసే చేతుల్లేవు
ఊరిపుడు ఊపిరిలేని జీవై జీవిస్తోంది

ఊరి పొలిమేరలన్నీ
ఒకప్పుడు పచ్చని రామచిలుకలు
మామిడిచెట్ల కింద
గోళీలు ఆడుకున్న ఆనవాళ్లు..
అటువైపు వెళ్లినప్పుడల్లా నన్నుచూసి...
ఏడుస్తూ పలకరిస్తున్నాయి పాత జ్ఞాపకాలు
కూనపెంకల కింద సేదతీరిన క్షణాలన్నీ ఆవిరైపోయాయి
గతాన్ని తవ్విచూస్తే
అస్థిపంజరాల్లా మిగిలిపోయిన
నా ఊరి ప్రేమంతా
మట్టిలో కలసిపోయింది
అభివృద్ధి మాటున అంథకారంలోకి
వెళుతుంది నా ఊరు

కోతికొమ్మచ్చి ఆటల్లేవు
నల్ల బొగ్గులతో గీసే కోయిలాల గీతల్లేవు
బతుకంత నల్లని మసిబూసినట్లు మసకబారింది
తొక్కుడుబిచ్చల్లేవు..గిల్లిదండల్లేవు
దాక్కుని ఆడుకునే దాగుడు మూతల్లేవు
మనుషుల వెనకాల దాక్కుని...
వెన్నుపోటు పొడిచే దొంగ దెబ్బలకు కొదవలేదిపుడు
చరవాని చేతిలోకచ్చి..
కొత్త నాగరికతను నేర్పి..
ప్రేమతీగల బంధాలను తెంచివేస్తోంది
మన ఊరిపుడు మారిన ఊరు
మారుతున్న ఊరు

చిగురిస్తున్న చింతపూత చింతపడుతున్నది
పూస్తున్న మామిడిపూత
మనసు నిలకడలేక రాలిపోతున్నది
జిట్టి నేరేడిపండ్లు దిగులుపడుతున్నాయి
పంట పొలాలన్నీ ఒంటరై
కన్నీరు కారుస్తున్నాయి
భూములన్నీ భూబకాసురుల
పెద్దపులుల చేతికిచిక్కి..
బక్కసిక్కిన జింకలై గుబులుపడుతున్నాయి
ఊరి పొలిమేరలను
ఆనుకొని వున్న ఆప్తులన్నీ
బాధపడుతున్నాయి
మారిపోతున్న ఊరుని చూసి
కన్న ఊరు రోజూ కల్లోకొచ్చి
పలకరిస్తూ ఉంటుంది
బాగోగులను యోగక్షేమాలను ఆరాతీస్తూ
అవన్నీ గుర్తొచ్చినపుడల్లా
కన్నీరుతో కాలక్షేపమే ఇపుడు

అశోక్‌ గోనె
94413 17361