Jul 03,2023 00:47

ప్రజాశక్తి - గుంటూరుజిల్లా ప్రతినిధి : పప్పుదినుసులు, కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు గత నెల రోజుల్లో అనూహ్యంగా పెరిగాయి. కందిపప్పు కిలో రూ.150కి పెరిగింది. రెండునెలల క్రితం కిలో కందిపప్పురూ.100 ఉండగా గత నెలలో రూ.120కు పెరిగింది. ఈనెలలో రూ.30 మరో పెరిగింది. మినపగుళ్లు రూ.100 నుంచి రూ.130కి పెరిగాయి. వేరుశనగ గుళ్లు రూ.130-150 పలుకుతుండగా పచ్చి పప్పు మాత్రం రూ.70 వద్ద నిలకడగా ఉంది.
ఉమ్మడి జిల్లాలో గతేడాది 50 వేల ఎకరాల్లో కందిసాగు చేయగా పంట చేతికి వచ్చే సమయంలో క్వింటాళ్‌ రూ.8 వేల నుంచి రూ.9వేలు పలికింది. ప్రస్తుతం దేశీయంగా కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల బర్మా, సౌత్‌ ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం కందులు క్వింటాళ్‌ ఏకంగా రూ.12 వేలకు పెరిగాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గడం వల్ల పంట మొత్తం వ్యాపారులచేతికి వెళ్లిన తరువాత ధరలుపెంచారు.
ప్రభుత్వం రేషన్‌కార్డులపై కందిపప్పు సరిగా సరఫరా చేయడంలేదు. అవసరమైన మేరకు సరఫరా రావడంలేదని చెబుతూ మండలాల్లో రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. పట్టణాల్లో సరఫరా లేదని రేషన్‌ సరఫరా చేసు వాహనదారులు ఇవ్వకుండానే వెళ్లిపోతున్నారు. సరఫరా ఉన్నా ప్రజలకు బియ్యం ఒక్కటి మాత్రమే ఇచ్చి ఇందుకు కిలోకి రూ.8 నుంచి రూ.10 ఇచ్చి మిగతా వస్తువులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు బయోమెట్రిక్‌ మిషన్‌లో అక్రమాలకు పాల్పడుతున్నా అధికారుల పర్వవేక్షణ ఉండటం లేదు.
జిల్లాలో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో ప్రతి వెరయిటీకి కిలోకి రూ.10 నుంచి రూ.20 వరకుపెరిగాయి. ప్రస్తుతం టమోటా ధర మార్కెట్‌లో రూ.120కి చేరింది. రైతుబజార్లలో రూ.50కి ఇస్తామన్నా సరఫరా పూర్తిగా లేదు. ఉన్నా నాణ్యత తక్కువగా ఉందని వినియోగదారులు వాపోతున్నారు. మార్కెట్‌లో కిలో రూ.20కి తక్కువగా దొరికే కూరగాయాలు లేవంటే అతిశయోక్తి కాదు. రైతు బజార్లలో ధరలు ఇలా ఉన్నాయి. క్యారెట్‌ రూ.50,కాకర రూ.36, బీర రూ.48, క్యాబేజి రూ.22, దొండ రూ.29, బంగాళదుంపలు రూ.22, గోరుచిక్కుడు రూ.35, ఉల్లిపాయలు రూ.20, దోసకాయ రూ.17, పొట్ల రూ.38, సొర రూ.24, బీట్‌ రూట్‌ రూ.31లకు విక్రయించారు. ఆకు కూరలు కట్ట రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతున్నాయి.
రెండు నెలలుగా వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత కావడంతో కూరగాయల తోటలు దెబ్బతింటున్నాయి. వేసవి తీవ్రత వల్ల కూరగాయలు తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30 వేల ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. యడ్లపాడు, ప్రత్తి పాడు, గుంటూరు రూరల్‌, చేబ్రోలు, అమరా వతి, తాడేపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో కూరగాయల తోటలు ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎద్దడి పెరగడం, కాల్వల ద్వారా నీరు రాకపోవడం వల్ల ఆకుకూరలు దెబ్బతిన్నాయి.