
ప్రజాశక్తి - కురుపాం : సామాన్య, మధ్యతరగతి పేదల కుటుంబాల్లో పప్పు ఉడకడంలేదు. కందిపప్పు ధర ఆకాశాన్నంటడమే దీనికి కారణం. మార్కెట్ మాయాజాలంలో కందిపప్పు ధర ప్రస్తుతం కిలో రూ.200 పలుకుతుంది. నిన్నటి దాకా టమాటా కొండెక్కింది. ప్రస్తుతం ఉల్లి ఘట్టెక్కింది దానికి తోడు కందిపప్పు ధర సగటు మనిషిని కలవరపెడుతుంది. వీటితో పాటు నిత్యావసరాల ధరలు చూసి 40 ఏళ్ల క్రితం ఓ ప్రజాకవి రాసినట్లు ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు పాట గుర్తుస్తుంది. కందిపప్పు సరసన మినపప్పు ధర కూడా చేరింది.
రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలి : సిపిఎం
రేషన్ సరుకుల ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు కోరారు. పేదలకు కందిపప్పు అందకపోవడంతో ధరలు అధికంగా పెరిగాయి. కందితో పాటు, మినపప్పు ధరలు పెరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల కందిపప్పు ఎండిఎం వాహనం ద్వారా పంపిణీ చేసిందిగా కోరారు. ఎండిఎంల ద్వారా కొద్దిమందికే కందిపప్పు అందుతుందని, మిగిలిన వారికి అందడంలేదన్నారు. పప్పులతో పాటు నూనెలు, తదితర 18 రకాల నిత్యావసర సరుకుల ఎండిఎం వాహనాల ద్వారా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.