ప్రజాశక్తి - రాజుపాలెం : జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద మండలంలోని గణపవరంలో కంది పంట సాగు, చిరు దాన్యాల సాగు విస్తీర్ణం పెంపుపై శుక్రవారం అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పల్నాడు జిల్లా జెసి ఎ.శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రైతులు అందరూ పత్తి పంటకు ప్రత్యమ్యాయంగా కంది పంటను ప్రధాన పంట గాను, అంతర పంట గాను, వరి, ప్రత్తి, మిరప గట్ల మీద కూడా కంది పంటను సాగు చేయాలని చెప్పారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించొచ్చన్నారు. కంది పంటకు ప్రభుత్వం మంచి మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. రైతులు అందరూ తమకు వున్న కొంత భూమిలో మంచి పోషక విలువలున్న రాగులు, కొర్రలు, సామలు, వరిగలు సాగు చేసుకోవాలని చూచించారు. ప్రతి కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలని, ఈ-క్రాప్‌లో పంట నమోదు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులుంటే ప్రభుత్వం అందించే పథకాలు, రాయితీలు వర్తిస్తాయన్నారు. కౌల్దార్లకు భూ యాజ మానులు సహకరించాలని కోరారు. క్రోసూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి.హనుమంత్రావు మాట్లా డుతూ అన్ని రైతు భరోసా కేంద్రాల్లో నూరుశాతం రాయితీపై కంది ఎల్‌ఆర్‌జి-52 రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, సిబ్బందిని సంప్రదించి తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి రాజేశ్వరి చంద్రమౌళి, ఏవో పి.వెంకట నర్సయ్య, సర్పంచ్ వి.నాగ మల్లేశ్వరరావు, ఎంపిటిసి ఎం.నందనం, డైరెక్టర్ బి.వెంకటేశ్వర్లు, బి.బాబు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు కె.సునీలా కుమారి పాల్గొన్నారు.










