
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
ఇంటి అవసరాలకు వాడే మురుగు నీటిని వృథాగా పోనివ్వకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రపుల్ల కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పి.రాజవరం, తాటియాకుల గూడెం పంచాయతీలలో ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి అవసరాలకు వాడే మురుగునీరు డ్రెయినేజీల ద్వారా చెరువుల్లోకి, కాలువల్లోకి వెళ్లని ప్రదేశాల్లో, కమ్యూనిటీ పరిధిలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలా చేయడం ద్వారా వృథా నీరు ఎక్కడ పడితే అక్కడ వుండకుండా ఇంకుడు గుంతలలోకి పోతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఉపాధి హామీ కార్యాలయంలో సంప్రదించవలసిందిగా సూచించారు. ఆయన వెంట పంచాయతీ సర్పంచులు సోయం కాంతమ్మ, వనమా రాంబాబు, కార్యదర్శులు వీరలక్ష్మి, సచివాలయం సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.