
కొరటాల శతజయంతిలో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం
ప్రజాశక్తి - భీమవరం
కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుల్లో ఒకరు కొరటాల సత్యనారాయణ అని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. మెంటేవారితోటలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద సత్యనారాయణ శతజయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్యనారాయణ చిత్రపటానికి జిల్లా కార్యదర్శి బలరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ 1923 సెప్టెంబర్ 24న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో జన్మించారన్నారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలను అలవాటు చేసుకున్నారు. విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. విద్యార్థి నాయకునిగా రాష్ట్ర ప్రధాన బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. చదువు మధ్యలోనే ఆపేసి తన యావత్ జీవితాన్ని అంకితం చేశారన్నారు. మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతంపై అత్యంత విశ్వాసంతో ఉంటూ ఉమ్మడి సిపిఐలో తరువాత సిపిఎం ఏర్పడిన తరువాత అగ్రనాయకుల్లో ఒకరిగా గుంటూరు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర పాలిట్‌బ్యూరో సభ్యునిగా విశేష సేవలు, బాధ్యతలు నిర్వర్తించారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రేపల్లెలో చేనేత కార్మిక సంఘాన్ని నిర్మించడంలో వారి సమస్యలపై విశేష కృషి చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి శాసన సభ్యునిగా పనిచేశారన్నారన్నారు. కొరటాల జీవితం ఆదర్శవంతమైందని, ఆయన అడుగుజాడల్లో కార్యకర్తలు నడవాలని, ఆయన ఆశయాల దిశగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.వైకుంఠరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కొరటాల సత్యనారాయణ అలుపెరుగని పోరాట యోధుడని పలువురు కొనియాడారు. స్థానిక మీరా స్మారక గ్రంథాలయంలో కొరటాల శతజయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కొరటాల తన జీవిత చరమాంకం వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచి ప్రజల కోసం పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, సభ్యులు పొగాకు నారాయణరావు, మంచిలి నీలకంఠం, పాలపర్తి లక్ష్మీనారాయణ, బళ్ల రామ్మోహనరావు, మంత్రి రామానాయుడు పాల్గొన్నారు.