Jun 25,2023 20:56

కమర్షియల్ షాక్

ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలోని వ్యాపారులకు ట్రూఅప్‌ షాక్‌ తగిలింది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ట్రూ అప్‌ పేరిట మూడు రకాలుగా కరెంటు ఛార్జీలను భారీగా పెంచేసింది. ఈ మేరకు యూనిట్‌కు సగటున మూడు దశలుగా 83 పైసల చొప్పున పెంచి, 36 మాసాలపాటు వసూలు చేయనుంది. ఈలెక్కన జిల్లాపై రూ.6.77 కోట్ల మేర భారం పడింది. ప్రభుత్వం పేద, ధనిక తారతమ్యాన్ని పాటించకుండా మూడు కేటగిరీల చొప్పున ట్రూఅప్‌ ఛార్జీలను బాదేస్తోంది.
ఉమ్మడి కడప జిల్లాలో హెచ్‌విడిఎస్‌ 267 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఐదు కేటగిరీల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని సబ్‌ స్టేషన్ల పరిధిలో 1,04208 లక్షల కమర్షియల్‌ సర్వీసులు ఉన్నాయి. చిన్నపాటి దుకాణాల దగ్గర నుంచి భారీ వాణిజ్య సముదాయాల వరకు ఉన్నాయి. ఈ ఏడాది మేలో 1,78, 23,142 యూనిట్ల మేర విద్యుత్‌ వినియోగం జరిగింది. ప్రభుత్వం రూ.83 పైసల చొప్పున ఇటీవల పెంచిన ట్రూ అప్‌ ఛార్జీల నేపథ్యంలో జిల్లాలోని వ్యాపార కేంద్రాలపై రూ.6.77 కోట్ల మేర అదనపు భారం పడింది. ఫలితంగా జిల్లాలోని వ్యాపార వర్గాలు రెట్టింపు బిల్లులు చెల్లించడంపై పట్ల ఆందోళనను వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 2014 నుంచి 2019 వరకు వచ్చిన ఆర్థిక నష్టాలను భర్తీ చేయడంలో భాగంగా ట్రూ అప్‌ఛార్జీలను పెంచేసింది. 2022 ఆగష్టు నుంచి 2025 జులై వరకు యూనిట్‌కు రూ.83 పైసలు చొప్పున పెంచేసింది. 2025 జులై వరకు ప్రతి నెలా ట్రూఅప్‌ పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. 2023 మార్చిలో 10.96, మేలో 13.57 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగమైంది. మే నెలకు ట్రాన్స్‌కో రూ.90.12 కోట్ల ఆదాయం లభించాల్సి ఉంది. 2023 ఏప్రిల్‌లో 11 లక్షల, మే 13.57 లక్షల యూనిట్లు వినియోగం కావడం గమనార్హం. ఈ లెక్కన నెలకు రూ.90.12 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. కమర్షియల్‌ సర్వీసులకు పెద్దమొత్తంలో బిల్లులు వచ్చాయి.
జిల్లా వ్యాప్తంగా బిపిఎల్‌ కేటగిరీ కింద ఎనిమిది లక్షల కుటుంబాల వరకు ఉన్న సంగతి తెలిసిందే. పేదల ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు ఇటువంటి సామాన్యులను ఛార్జీల పెంపుదల నుంచి మినహాయించకపోవడం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుత ట్రూఅప్‌ ఛార్జీల పెంపు విషయంలో జిల్లాలోని 1,04208 వేల కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్లు మీద ట్రూ అప్‌ ఛార్జీలను రెట్టింపు చేయడం పట్ల వచ్చే ఆదాయం కరెంటు ఛార్జీలకు సరిపోతోందనే వాదన వినిపిస్తోంది. రెండు నెలల కిందట కడప నగరంలోని ఓ చిరు వ్యాపారికి రూ.400 వచ్చే కరెంటు బిల్లు ప్రస్తుతం రూ.900 రావడం ఆందోళన కలిగించిందని పేర్కొనడం గమనార్హం. పెట్టుబడికి వడ్డీల చెల్లింపులు పోగా జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోవడం గమనార్హం.