Nov 06,2023 21:13

వరిచేను ఎండిపోవడంతో పశువులను మేతకు విడిచిపెట్టిన రైతులు

ప్రజాశక్తి -గుర్ల, మెరకముడిదాం : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. నీరులేక వరిచేలు ఎండిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గెడ్దల్లోను, చెరువుల్లోను ఉన్న నీటిని మోటార్లు ద్వారా పలుచోట్ల తోడుకుంటూ వరిచేలను బతికించు కునేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయిన వరిచేలను పశువుల మేతకు రైతుల వదిలేస్తున్నారు. ఈనేపథ్యంలో పలు మండలాల్లో కరువు పరిస్థితికి ఈ దుస్థితి అద్దం పడుతోంది.
గుర్ల మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల వరి పంట ఎండిపోతోంది. మండలంలో 9920 ఎకరాలలో వరిసాగైనట్లు అధికారులు చెబుతున్నారు. గడిగెడ్డ ఆయకట్టు పరిధిలో 2900 ఎకరాలకు సాగునీరు అందుతోంది. పొట్టదశకు చేరిన దశలో ఈ గెడ్డ ద్వారా 50శాతం మాత్రమే సాగునీరు అందుతోంది. గడిగెడ్డ ప్రాజెక్ట్‌ పరిధిలో కుడికాలువ కింద బూర్లిపేట, పల్లిగండ్రేడు, గరికివలస, గజపతినగరం మండలం కెంగువ, ఎడమ కాలువ కింద తెట్టంగి, గూడెం, పాలవలస, పున్నపురెడ్డి పేట గ్రామాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా శివారు గ్రామాలకు సాగునీరు అందని ద్రాక్షగా ఉంది. ఇక వర్షాధారం తో సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం సాగునీరు లేక పంట ఎండిపోతోంది. అక్టోబర్‌లో సాధారణ వర్ష పాతం 180.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, 2.8 మిల్టీమీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పంటను కాపాడుకొనేందుకు రైతులు ఆయిల్‌ ఇంజన్లతో నీరు తోడు తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీరు తోడిన మరుసటిరోజుకే పదును అరిపోతుందని రైతులు అంటున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు ఆయిల్‌ ఇంజన్లు, పైపులు కోసం పరుగులు తీయడంతో వాటి ధరలకూ రెక్కలు వచ్చాయని ఆవేదన చెందుతున్నారు..ఎన్ని ప్రయత్నాలు చేసినా వరిపంట చేతికి అందడం కష్టమే అని రైతులు అంటున్నారు.
మరోవైపు తోటపల్లి కాలువ నుంచి సాగునీరు అందకపోవడంతో వరి పంటకు ఇబ్బందిగా మారింది. అప్పులుచేసి పెట్టుబడి పెట్టిన పంట చేతికి అందక పోతే అప్పుల ఊబిలో కూరుకుపోతామని, ఈ నేపథ్యంలో మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పంటల బీమా అందచేయాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని అంటున్నారు.
పంట పశువుల పాలు
మెరకముడిదాం మండలంలో వరిపంటకు తీవ్రంగా నష్టం కలిగింది. వర్షా భావ పరిస్థితులతో పొట్ట దశలో పంట దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. మండలంలో 8,697 ఎకరాల్లో వరి పంట వేశారు. తీవ్ర వర్షాభావం, ఎండల తీవ్రత వల్ల వరి చేలు పూర్తిగా ఎండి పోవటంతో రైతులు పశువులను మేతకు వదిలి వేస్తున్నారు. ప్రస్తుతానికి మండలంలో సుమారు 3వేల ఎకరాలు వరకు తీవ్ర ంగా దెబ్బతింది. ఎక్కడో బోర్లు ఉన్న ప్రాంతంలో తప్ప, మిగతా చోట్ల నీరు లేక తీవ్ర కరువు వాటిల్లే అవకాశం ఉండటంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
గడిగెడ్డ నీరూ అందలేదు
నీరులేక వరి పంట ఎండిపోతుంది. వర్షాలు కురవక పోవడం, గడిగెడ్డనుండి శివారు గ్రామాలకు సాగునీరు అందకపోవడంతో వరి పంట దెబ్బతిన్నది. నేను ఎకరా పొలంలో వరి వేశాను. ఇప్పటివరకు సుమారుగా రూ.24 వేలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
- బి.అప్పలనాయుడు, రైతు,
గూడెం గ్రామం, గుర్ల మండలం
తోటపల్లి నీరు రాలేదు
సకాలంలో వర్షాలు పడకపోవడంతో వరి పంట దెబ్బతింది, ప్రస్తుతం నీరు లేక పంట ఎండిపోతుంది. తోటపల్లి నీరు వస్తుందని ఆశించినా రాలేదు. నాయకులు, అధికారులు పట్టించుకోలేదు. నేను 3 ఎకరాలలో వరి వేశాను. నీటి ఎద్దడితో పంట ఎండిపోవడం ఒక పక్క, చీడ పురుగుల నుంచి పంటను రక్షించుకునేందుకు మరోవైపు ఇబ్బందులు పడుతున్నాం.
-రెల్లి రమణ, రైతు,
పల్లిగండ్రేడు, గుర్ల మండలం