Aug 13,2023 21:33

నర్రెలు తేరిన వరి నాట్లు

ప్రజాశక్తి - సాలూరు : తీవ్ర వర్షాభావంతో మండలంలో కరువు మేఘాలు కమ్ముకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడడం లేదు. దమ్ములు అయిన తర్వాత వర్షాలు లేకపోవడంతో వరి పొలాలు బీటలు వారుతున్నాయి. చెరువుల్లోని నీరు దమ్ములకే సరిపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండలంలోని కూర్మరాజుపేటలో సుమారు 500ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వర్షాధార భూములు కావడంతో రైతులు ఆందోళ నకు గురవుతున్నారు. వర్షాకాలమైనా సవవృద్ధిగా వానలు లేకపోవడం అన్నదాత లను కలవరపెడుతోంది. గత నెలలో కురిసిన వర్షాలకు వరి నాట్లు వేశారు. విద్యుత్‌ బోర్లు వున్న రైతులు వరి పొలాలను కాపాడుకుంటున్నారు. లేని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో సమృద్ధిగా వానలు కురవడంతో వరి పంట ఆశాజనకంగా పండింది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర వర్షాభావంతో నష్టపోయే పరిస్థి తులు నెలకొన్నాయి. మండలంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు సరఫరా అయ్యే అవకాశం లేదు. దీంతో వరి సాగు పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది.
చుట్టూ ప్రాజెక్టులున్నా ఫలితం సున్నా
సాలూరు పట్టణం, మండలం చుట్టూ సాగునీటి ప్రాజెక్టులున్నా స్థానిక పంట భూములకు సాగునీరందే పరిస్థితి లేదు. పాచిపెంటలో పెద్దగెడ్డ ప్రాజెక్టు వల్ల ఈ మండలంలో చాలా తక్కువ భూములకు సాగునీరందుతుంది. మూడు మండలాల్లో 33 గ్రామాలకు చెందిన 11వేల ఎకరాలకు మాత్రమే పెద్దగెడ్డ నీరు చేరుతోంది. వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు కూడా సాలూరు మండలంలో ఉన్నప్పటికీ స్థానిక భూములకు ఉపయోగం లేదు. విఆర్‌ఎస్‌ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. దీంతో కూర్మరాజుపేట, బోరబంద, పెదపదం పంచాయతీ పరిధిలో భూములు వర్షాలపైనే ఆధారపడి వున్నాయి.
వర్షాల కోసం కప్ప పండుగ
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూర్మరాజుపేటకు చెందిన రైతులు ఆదివారం వర్షాల కోసం కప్ప పండుగ చేశారు. గ్రామ పొలిమేరల్లో వున్న పణుకు వద్దకు రైతులంతా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వానదేవుడికి పరమాన్నం వండి పణుకుపై వడ్డించుకొని కప్పల మాదిరిగా ఆరగిస్తారు. వర్షాభావ పరిస్థితిలో ఏటా గ్రామస్తులు ఈ కప్ప పండుగ చేస్తున్నారు. ఈ పండుగ చేసిన రోజు వర్షం పడుతుందనే నమ్మకం రైతుల్లో గత కొంతకాలంగా వుంది.