
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
వర్షాభావం నేపథ్యంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకునే విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భజలాలపైనే తీవ్ర ప్రభావం పడుతోంది. గడిచిన ఆగస్టులో అత్యంత దారుణంగా జిల్లాలో సరాసరి వర్షపాతంలో 62 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 60 శాతంపైగా లోటు వర్షం పాతం నమోదైన మండలాల్లో లింగపాలెం, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, ఉంగుటూరు, పోలవరం, కొయ్యలగూడెం, భీమడోలు, పెదవేగి, పెదపాడు, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, ఆగిరిపల్లి వంటి మండలాల్లో ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 27 మండలాలుండగా ఆగస్టులో 26 మండలాల్లో మైనస్ వర్షపాతం నమోదైంది. గోదావరి డెల్టా ఆధారిత ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొంతమెరుగ్గా ఉన్నప్పటికీ, ఏలూరు జిల్లాలోని మెట్టప్రాంతంలో మాత్రం పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్‌సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. సాగునీరులేక పొలాలు దెబ్బతింటున్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. ఏలూరు జిల్లాలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ఇందులో వర్షాభావం, మోటార్లపై ఆధారపడిన సాగు పెద్దఎత్తున ఉంది. కుక్కునూరు, వేలేరుపాడు వంటి మండలాల్లో మిర్చి, పత్తి వంటి పంటలను రైతులు సాగుచేశారు. చినుకుజాడలేక జనం అల్లాడిపోతున్నారు. వేసవితరహాలో ఎండలు కాస్తుండటంతో ఉక్కపోతకు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. చింతలపూడి మండలంలో దాదాపు 2,300 ఎకరాల వరకూ వర్షాధారంతో వరిసాగును రైతులు చేపట్టారు. వర్షాభావం వరి పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోవడంతో పశువులకు సైతం తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పట్టిసీమ ద్వారా చెరువులను నింపాలని అక్కడ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. మెట్టప్రాంతంలోని చెరువులు వర్షాల్లేక ఎండిపోతున్నాయి. దీంతో ఇటు పంటలకు, పశువులకు సైతం నీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి మోటారు బోర్లు నుంచి సైతం నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో కరువు ఛాయలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నాయి. అనేక మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల కింద మినుము, పెసర వంటిపంటలు వేశారు. వర్షం లేకపోవడంతో ఆ పంటు కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతంలో వేసిన మిర్చి, పత్తిపంటలు సైతం వర్షాభావం కారణంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. మరికొద్దిరోజుల్లో వర్షాలు పడకపోతే ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో దుర్భర పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు ఏంచేయాలో అర్ధంకావడం లేదు. జూలైలో వర్షం సరిపడనంత కురవడంతో రైతులు పంటలు వేశారు. ఆగస్టుకు వచ్చేసరికి పూర్తిగా వరుణుడు కనుమరుగైన పరిస్థితి ఉంది. దీంతో వేసిన పంటలు ప్రమాదంలో పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతానికి సాగునీటి ఇబ్బందులు లేకపోయి నప్పటికి మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ఇబ్బందులు తప్పవని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎండలకు వరిపొలాలు తెగుళ్ల బారిన పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. వర్షాలు లేక కరువు ఛాయలు అలముకుంటున్నాయి.