చిటపట చినుకులు పడుతున్న వేళ వేడి వేడి అన్నంలో కాస్తంత కారప్పొడి వేసుకుని, మరికాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఈ కోవిడ్ వేళ రుచిని, ఆరోగ్యాన్ని అందించే రకరకాల కారంపొడులను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
అవిసె గింజలతో..
కావాల్సిన పదార్థాలు : అవిసె గింజలు- ఒక గ్లాసు, పుట్నాల పప్పు- అర గ్లాసు, మంచి నూనె- అర టీస్పూను, జీలకర్ర- రెండు టేబుల్ స్పూనులు, ఉప్పు- తగినంత, పల్లీలు- అరగ్లాసు, ఎండు మిరపకాయలు- ఆరు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు.
తయారుచేసే విధానం : ముందుగా పాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేయాలి. అవి కొంచెం వేగాక, పుట్నాల పప్పు, అవిసెలు వేసి కలియతిప్పుతూ జీలకర్రను వేసి, దోరగా వేపి, పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత అదే పాన్‌లో కొంచెం నూనె వేసుకుని, ఎండు మిరపకాయలు వేసి వేపాలి. ముందుగా వేపిన మిరపకాయలు చల్లారనివ్వాలి.
- తర్వాత చల్లారిన మిరపకాయలు, తగినంత ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అందులోనే ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, అవిసె గింజలను వేయాలి. వాటినీ బాగా గ్రైండ్ చేయాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి, మరోసారి గ్రైండ్ చేయాలి.
చల్ల(ఊర) మిరపకాయలతో..
కావాల్సిన పదార్థాలు : వేపిన శనగపప్పు- 250 గ్రాములు, ఎండు కొబ్బరి- 125 గ్రాములు, చల్ల మిరపకాయలు-75 గ్రాములు, వెల్లుల్లి-35 గ్రాములు, జీలకర్ర-35 గ్రాములు, ఉప్పు- కొద్దిగా, నూనె- మిరపకాయలని వేపుకోడానికి సరిపడేంత.
తయారుచేసే విధానం : - నూనెలో చల్ల మిరపకాయలని ఎర్రగా వేపి, తీసి పక్కన పెట్టుకోవాలి.
- మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కోటిగా వేగించి, పక్కన పెట్టుకోవాలి.
- వేగించిన మిరపకాయల తొడిమలు తీసేసి, కాస్తంతే ఉప్పు వేసి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- గ్రైండ్ చేసుకున్న పొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే కనీసం రెండు నెలలు నిల్వ ఉంటుంది.
నువ్వులతో..
కావాల్సిన పదార్థాలు : తెల్లనువ్వులు - 250 గ్రాములు, జీలకర్ర-ఐదు చెంచాలు, ఎండుమిర్చి -12, ఉప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, శనగపప్పు- టేబుల్ స్పూను, ఆవాలు- టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం : - ముందుగా శుభ్రం చేసిన నువ్వులను దోరగా వేగించి, పక్కన పెట్టుకోవాలి.
- స్టౌమీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి, అది వేడెక్కాక పోపు దినుసులు వేపాలి.
- ముందే వేపిన నువ్వుల్లో పోపు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి.
- గాలి చొరబడకుండా, తడి తగలకుండా ఉంచితే ఈ నువ్వుల పొడి నెల రోజుల వరకూ పాడవదు.
రొయ్యలతో..
కావాల్సిన పదార్థాలు : ఎండు రొయ్యలు- 250 గ్రాములు (శుభ్రం చేసినవి), వెల్లుల్లి - రెండు పాయలు (రెబ్బలుగా విడదీసి పెట్టుకోవాలి), జీలకర్ర- కొంచెం, ఎండు మిరపకాయలు- 25, నూనె- తగినంత, కల్లు ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం : - ముందుగా శుభ్రం చేసిన ఎండు రొయ్యలను పాన్‌లో కమ్మని వాసన వచ్చే వరకూ వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటినిచిల్లుల గిన్నెలో వేసి, చేతితో తిప్పాలి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది.
- స్టౌమీద పాన్ పెట్టుకుని కాస్త నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక అందులో ఎండు మిరపకాయలు వేసి, వేపాలి.
- తర్వాత రోటిలో వేగించి పెట్టుకున్న ఎండు మిరపకాయలను మెత్తగా దంచుకోవాలి. అందుకు చాలా సమయం పడుతుంది. ఇంకా అందులోనే తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసి దంచుకోవాలి.
- చివరిలో వెల్లుల్లిని రెబ్బలనూ వేసి, కచ్చాపచ్చాగా దంచుకోవాలి.